ఎంతో చారిత్రక నేపథ్యం, ఘనమైన చరిత్ర కలిగిన ఢిల్లీ యూనివర్సిటీకి ఈ ఏడాది వందేళ్లు పూర్తవుతోంది. 1922లో ఈ యూనివర్సిటీని స్థాపించారు. దీంతో యూనివర్సిటీ శతాబ్ది వేడుకలకు సిద్ధం అవుతోంది. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా యూనివర్సిటీ అధికారులు ఈ ఏడాది మొత్తం వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు.  

ఎంతో మంది విద్యార్థుల‌ను ఉన్న‌తులుగా తీర్చిదిద్దిన ఢిల్లీ యూనివ‌ర్సిటీ (Delhi University) వందేళ్ల వేడుక‌ల‌కు సిద్ధం అవుతోంది. మే 1, 2022 నుండి తన శతాబ్ది వేడుక‌ల‌ను ప్రారంభించనుంది. ఈ మేర‌కు ఆ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ (Yogesh Singh) విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి వివ‌రాలు వెళ్ల‌డించారు. యూనివ‌ర్సిటీలో ఈ ఏడాది మొత్తం కొత్త హాస్టళ్లు, భవనాలు నిర్మించ‌డంతో పాటు కొత్త కోర్సులు వంటివి ప్రారంభిస్తామ‌ని చెప్పారు. 

“ శతాబ్ది ఉత్సవాలు ఒక చారిత్రాత్మక ఘట్టం. వందేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అలాంటి అవకాశాలు వస్తున్నాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే అవకాశం ల‌భించ‌డం మాకు, విశ్వవిద్యాలయంతో అనుబంధంతో ఉన్న వారందరికీ గ‌ర్వ‌కార‌ణం.” అని యోగేష్ సింగ్ తెలిపారు. మే 1 యూనివర్సిటీ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని Delhi univercity స్మారక స్టాంప్‌తో అన్ని వేడుకలను ప్రారంభిచ‌నుంది. దీంతో పాటు అనేక కార్యక్రమాల‌ను ప్లాన్ చేసింది. 

ఢిల్లీ యూనివ‌ర్సిటీలో చ‌దివి వివిధ కార‌ణాల వ‌ల్ల త‌మ చ‌దువును పూర్తి చేసుకోలేని విద్యార్థులకు మంచి అవ‌కాశం ల‌భించ‌నుంది. అలాంటి విద్యార్థులు త‌మ కోర్సును పూర్తి చేసుకునేందుకు సెంటెన‌రీ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని వైస్ ఛాన్స‌ల‌ర్ మీడియా స‌మావేశంలో తెలిపారు. దీంతో పాటు యూనివర్సిటీలో బీటెక్‌ (B tech) వంటి టెక్నికల్‌ కోర్సులను ప్రారంభించనున్నట్లు ఆయ‌న చెప్పారు. కంప్యూటర్ సైన్స్ఇం అండ్ ఇంజ‌నీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, క్యాంపస్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్‌లో మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్‌లో UG, PG కోర్సులు మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు చెప్పారు. 

వందేళ్ల వేడుక సంద‌ర్భంగా వర్సిటీ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని కూడా యోచిస్తోంది. కళాశాలలు వారి స్థాయిలో సామాజిక, సంక్షేమ,ఆధారిత లక్ష్యాల కోసం కూడా పని చేయాలని వర్సిటీ కోరింది. ‘‘ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయ‌డంతో పాటు శతాబ్ది ఉత్స‌వాల్లో భాగంగా ప‌లు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని నిర్ణ‌యించాం. అలాగే యూనివర్శిటీ క్యాంపస్‌లలో 100 ప్రదేశాలలో ఏకకాలంలో 100 చెట్లను నాటడానికి కూడా ప్లాన్ చేశాం ’’ అని వైస్ ఛాన్స‌ల‌ర్ యోగేష్ సింగ్ తెలిపారు. 

800-1000 పడకల సామర్థ్యంతో రెండు కొత్త హాస్టళ్లను వ‌చ్చే రెండేళ్ల‌లో నిర్మించాల‌ని యూనివ‌ర్సిటీ ప్లాన్ చేసింది. ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ కోసం కొత్త భవనం, కొత్త అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లు కూడా నిర్మించనున్నారు. 

ఇవే కాకుండా ఢిల్లీ యూనివ‌ర్సిటీ, దాని నేప‌థ్యంలో, ఏర్పాటు చేయ‌డానికి కార‌ణాలు, చరిత్ర వంటి విష‌యాల‌ను లైట్ అండ్ సౌండ్ షో (Light and sound show) ద్వారా డాక్యుమెంటరీలను హోస్ట్ చేయాలని కూడా వ‌ర్సిటీ యోచిస్తోంది. delhi univercity స్టూడియోను కూడా ప్రారంభించనున్నట్లు యోగేష్ సింగ్ తెలిపారు. “ లిట్-ఫెస్ట్‌లు, పుస్తక మేళాలు, అరుదైన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌ల ప్రదర్శన, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సెమినార్‌లు, సమావేశాలు, వర్క్‌షాప్‌లు, లెక్చర్ సిరీస్‌ల నిర్వహణ, అవగాహన ఒప్పందాలు, అంతర్జాతీయ మార్పిడి కార్యక్రమాలపై సంతకాలు, పరిశోధన, అభివృద్ధి, వినూత్న పద్ధతులు ఇతర సారూప్య కార్యకలాపాలు నిర్వ‌హిస్తాము ’’ అని ఛాన్స‌ల‌ర్ తెలిపారు.