గాల్వన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరవీరులైన నాటి నుంచి భారత్-చైనా మధ్య సంబంధాలు మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్ భారతీయుల నుంచి వచ్చింది.

మరోవైపు దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుందనే ఆరోపణలపై 59 చైనీస్ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తాజాగా ఢిల్లీకి చెందిన హోల్ సేల్ వ్యాపారులు చైనా వస్తువుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

చైనాలో తయారైన గాలిపటాలను, చైనా మాంజాను అమ్మబోమని తేల్చి చెప్పారు. సాధారణంగా ప్రతీ ఏటా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అనేక రాష్ట్రాలకు ఢిల్లీ నుంచి ఇవి రవాణా అవుతూ ఉంటాయి.

అయితే చైనాలో తయారైన మాంజాతో గాలిపటాలను  ఎగురువేసినప్పుడు హానికరమైన, ప్రమాదకరమైన ఆ దారం మెడకు చుట్టుకుని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. అయినా దీనిని కొనేందుకు పలువురు ఇష్టపడుతుంటారు.

కానీ ఈసారి వీటిని తాము విక్రయించేది లేదని ఢిల్లీ వ్యాపారులు స్పష్టం చేశారు. దేశ రాజధానిలోని లాల్‌కౌన్ హోల్‌సేల్ మార్కెట్ అత్యంత ఆకర్షణీయమైన , రంగురుంగుల గాలి పటాలకు ప్రసిద్ధి.