నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీస్ కమీషనర్ మీడియాతో మాట్లాడారు. రైతు సంఘాల నేతలు నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.

ర్యాలీపై ముందుగానే రైతుల సంఘాల నేతలతో 5 రౌండ్లు చర్చించామని సీపీ పేర్కొన్నారు. నిబంధనలకు రైతు నేతలు ఒప్పుకున్నాకే ర్యాలీకి అనుమతించామని కమీషనర్ వెల్లడించారు.

రిపబ్లిక్ డే రోజున ర్యాలీ వద్దన్నా రైతు నేతలు వినలేదని... రైతు సంఘాల నేతలు ప్రసంగాలు రెచ్చగొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. పోలీసుల వద్ద అన్ని అవకాశాలున్నప్పటికీ సంయమనం పాటించామని సీపీ వెల్లడించారు.

ప్రాణనష్టం జరగకూడదనే సంయమనం పాటించామని.. అగ్రిమెంట్ ప్రకారం తాము సంయమనం పాటించామని ఆయన గుర్తుచేశారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో 394 మంది పోలీసులు గాయపడ్డారని... ఇప్పటికే చాలా మంది ఆసుపత్రుల్లో ఉన్నారని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read:ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ: అమిత్ షా చేతికి పోలీసుల నివేదిక

కాగా, నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలపై దేశం ఉలిక్కిపడింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తలమునకలై వున్న అధికారులు.. ఢిల్లీలో జరిగిన విధ్వంసంపై ఆలస్యంగా కళ్లు తెరిచారు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఢిల్లీ పోలీసులు నివేదిక అందజేశారు.

ఈ వ్యవహారంపై ఇంత వరకు 35 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 200 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు ఈ కేసును అప్పగించే అవకాశం వుంది. రైతుల్లో సంఘ వ్యతిరేక శక్తులు కలిసిపోయారని .. రూట్ మ్యాప్‌ను మార్చి వ్యూహాత్మకంగా ఎర్రకోటపై దాడికి తెగబడ్డారని తెలుస్తోంది.