ఓ బిజినెస్ మెన్.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే..  ఆ విషయం కాస్త.. సదరు యువతికి కాబోయే భర్తకు తెలిసిపోయింది. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో మరో వ్యక్తి రిలేషన్ పెట్టుకోవడం అతనికి నచ్చలేదు. ఇంకేముంది ఏకంగా.. ఆ బిజినెస్ మెన్ ని అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టేశాడు. ఆ తర్వాత ఆ సూట్ కేసుతోపాటు రైలు ఎక్కి ఆ తర్వాత ఆ సూట్ కేసుని వేరే ప్రాంతంలో పడేశాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీకి చెందిన నీరజ్ గుప్తా(46) ఓ ప్రముఖ వ్యాపారవేత్త. అతనికి అతని కంపెనీలో పనిచేసే ఫైసల్(29)తో గత కొంతకాలంగా ఎఫైర్ నడుస్తోంది. అయితే.. ఫైసల్ కి ఇటీవల పెళ్లి కుదిరింది. ఆ పెళ్లికి నీరజ్ గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశాడు. వేరేవాళ్లను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదంటూ ఫైసల్ ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు.

దీంతో.. ఫైసల్, ఆమె తల్లి షహీన్ నాజ్(45), ఫైసల్ కాబోయే భర్త జుబర్(28)లు పథకం ప్రకారం నీరజ్ గుప్తాను చంపేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో నీరజ్ గుప్తాను మాట్లాడాలంటూ పిలిచి అతని తలపై బలంగా కొట్టారు. అతను స్పృహ తప్పి పడిపోగానే.. జుబర్.. గుప్తా పొట్టలో కత్తితో మూడు, నాలుగు సార్లు పొడిచాడు. ఆ తర్వాత గొంతు కూడా కోశాడు. వీరికి ఫైసల్, ఆమె తల్లి పూర్తిగా సహకరించారు. అనంతరం తెలివిగా శవాన్ని కూడా మాయం చేశారు.

అయితే.. నీరజ్ గుప్తా కనిపించకుండా పోవడంతో అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్తకు ఆఫీసులో పనిచేసే ఫైసల్ తో అక్రమ సంబంధం ఉందని... తన భర్త కనిపించకుండా పోవడానికి ఆమెకు సంబంధం ఉండి ఉంటుందని పోలీసులకు ఆమె చెప్పింది.

ఆమె అనుమానంగా చెప్పడంతో.. ఆ దిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. విచారణలో నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఫైసల్ తో నీరజ్ గుప్తా.. దాదాపు పది సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలడం గమనార్హం.