Asianet News TeluguAsianet News Telugu

దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

నిరుడు మార్చిలో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓ వివరణ కోరింది. మతంతో సంబంధం లేకుండా వారసత్వ చట్టాల రూపకల్పనపై అభిప్రాయం చెప్పాలని దీనికి సంబంధించిన ఐదు పిటిషన్లను విచారణకు చేపట్టింది. దీంతో దేశంలో ఉమ్మడి పౌర స్మృతికి బాటలు పడుతున్నాయనే అభిప్రాయం ఏర్పడింది.

Delhi HC backs Uniform Civil Code, says Indian society becoming homogeneous - bsb
Author
Hyderabad, First Published Jul 9, 2021, 2:48 PM IST

ఢిల్లీ : భారత దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం చాలా ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దీనిని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆధునిక భారతదేశం క్రమంగా సజాతీయం, ఏకజాతిగా మారుతోందని, సంప్రదాయ కుల, వర్గ, మతపరమైన అంతరాలు అంతరించిపోతున్నాయని పేర్కొంది.

ఈ మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరమని తెలిపింది. మీన కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు హిందూ వివాహ చట్టం, 1955 వర్తించడానికి సంబంధించిన కేసులో జూలై 7న ఇచ్చిన తీర్పులో ప్రతిభ ఎం సింగ్  ఈ వ్యాఖ్యలు చేశారు.

వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమవుతున్న వైరుధ్యాలు న్యాయస్థానానికి పదే పదే వస్తున్నాయని జస్టిస్ ప్రతిభ పేర్కొన్నారు. ఇటువంటి వైరుధ్యాల వల్ల వివాహ బంధంలో ప్రవేశించిన వివిధ కమ్యూనిటీలు, తెగలు, కులాలు, మతాలకు చెందిన 
భారతీయ యువత తమ పెళ్లిళ్ల విషయంలో వివిధ వ్యక్తిగత చట్టాల్లోని వైరుధ్యాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో పోరాడవలసిన తప్పనిసరి పరిస్థితిని కల్పించకూడదన్నారు.

మరీ ముఖ్యంగా పెళ్లి, విడాకుల విషయంలో యువత పోరాడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.  భారత రాజ్యాంగంలోని అధికరణ 44 ఆశించినట్టుగా ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అవసరాన్ని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు చెబుతోందన్నారు. ఇటువంటి పౌరస్మృతి అందరికీ సార్వజనీనంగా వర్తిస్తుందన్నారు. పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో ఏకరీతి సిద్ధాంతాల వర్తింపు దోహదపడుతుందన్నారు.

వివిధ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే వైరుధ్యాలు, అసంగతాలను ఉమ్మడి పౌర స్మృతి తగ్గిస్తుందన్నారు. నిరుడు మార్చిలో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓ వివరణ కోరింది. మతంతో సంబంధం లేకుండా వారసత్వ చట్టాల రూపకల్పనపై అభిప్రాయం చెప్పాలని దీనికి సంబంధించిన ఐదు పిటిషన్లను విచారణకు చేపట్టింది. దీంతో దేశంలో ఉమ్మడి పౌర స్మృతికి బాటలు పడుతున్నాయనే అభిప్రాయం ఏర్పడింది.

పెళ్లి విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాలకు వర్తించే చట్టాలు ప్రస్తుతం మనదేశంలో వేర్వేరు మతాలకు వేర్వేరుగా ఉన్నాయి. హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ డైవర్స్ యాక్ట్,  పార్శీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ వంటివి అమల్లో ఉన్నాయి.

అయితే ముస్లిం పర్సనల్ చట్టాన్ని క్రోడీకరించలేదు.  ముస్లింల మతపరమైన గ్రంధాలే వీటికి ఆధారం. ఈ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తూ, అన్ని మతాల వారికి ఒకే విధమైన నిబంధనలు వర్తించేలా చేయడానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని చాలా మంది చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios