కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిరసనలో భాగంగా జనవరి 26న రిపబ్లిక్ డే నాడు రైతులు పిలుపునిచ్చిన ట్రాక్టర్ల ర్యాలీకి పోలీసులు అనుమతించారు. ఢిల్లీ రింగ్ రోడ్ పరిధిలో ర్యాలీకి అనుమతినిచ్చారు పోలీసులు. 

కాగా, తమను అంతం చేయడానికి, ఈ నెల 26 న తమ ట్రాక్టర్ ర్యాలీని భంగ పరచేందుకు కుట్ర జరుగుతోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. సింఘు బోర్డర్ లో మీడియాతో మాట్లాడిన వారు.. తాము ఓ వ్యక్తిని పట్టుకున్నామని, నలుగురు రైతు నేతలపై కాల్పులు జరపాలని, ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోవాలని కొందరు తనను ఆదేశించినట్టు ఆ వ్యక్తి తెలిపాడని వెల్లడించారు.

ముఖానికి స్కార్ఫ్ ధరించి ఉన్న ఇతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తనతో బాటు ఇద్దరు మహిళలతో సహా 9 మంది కూడా ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని ఈ వ్యక్తి చెప్పినట్టు వారు పేర్కొన్నారు.

సుమారు 21 ఏళ్ళ ఈ వ్యక్తిని రైతులు పోలీసులకు అప్పగించారు. సోన్‌పట్ పోలీసులు ఇతడిని విచారిస్తున్నారు. కాగా కొంతమంది పోలీసు అధికారుల పేర్లను కూడా ఈ యువకుడు వెల్లడించాడు.

కానీ వారి గురించి రైతులు తెలుసుకోగా-తమకు ఈ యువకునికి అసలు సంబంధమే లేదని వారు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే నిన్న మీడియా ముందు హల్ చల్ చేసిన ఆ వ్యక్తి ఇవాళ యూటర్న్ తీసుకున్నాడు.

శుక్రవారం సోనిపట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చి ఓ వీడియోలో అతడు పూర్తి విరుద్ధంగా మాట్లాడాడు.

తనకు ఏ పాపం తెలియదనీ.. రైతులు ముందుగా రాసిచ్చిన స్క్రిప్టునే తాను మీడియా ముందు చదివానంటూ సదరు వీడియోలో అతడు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియో అసలైనదా కాదా అనే దానిపై పోలీసులు ధ్రువీకరించలేదు.