ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇది ఢిల్లీ ప్రజల విజయమన్న ఆయన నూతన రాజకీయాలకు ఢిల్లీ ప్రజలు నాంది పలికారని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ తల్లి తన కుమారుడిని మళ్లీ నమ్మి గెలిపించిందని పనిచేసే వారికే పట్టం కడతారని ప్రజలు నిరూపించారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయని, మరో ఐదేళ్ల పాటు కష్టపడి పనిచేస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కేజ్రీవాల్ తన సమీప ప్రత్యర్థిపై 13,508 ఓట్ల తేడాత ఘన విజయం సాధించారు. 

అంతకుమందు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. పట్‌పర్ గంజ్ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలను చేసిందని.. కానీ ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గుర్తుచేశారు.