న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీపై పడింది. ఎన్నికల్లో పార్టీ తగిన ఫలితాలను సాధించని నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. అయితే, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ శానససభలో మొత్తం 70 స్థానాలు ఉండగా, బిజెపి కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. భోజ్ పూరి గాయకుడైన తివారీ 2016లో ఢిల్లీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే, ఆయనను కొనసాగించే ఉద్దేశం బిజెపి అధినాయకత్వానికి లేదని అంటున్నారు. 

మనోజ్ తివారీ స్థానంలో మరొకరిని నియమించాలని బిజెపి అగ్ర నాయకత్వం భావిస్తున్నప్పటికీ సంస్థాగత ఎన్నికల తర్వాతనే అది జరుగవచ్చునని అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల కారణంగా సంస్థాగత ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఒకటి, రెండు నెలల్లో ఆ ఎన్నికలు జరగవచ్చునని భావిస్తున్నారు. 

ఢిల్లీ బిజెపి అధ్యక్షుడిగా ఆయన మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. తివారీ పనితీరుపై బిజెపి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో ఆయనను పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే, పూర్వాంచల్ ఓటర్లను బిజెపి వైపు మళ్లించడంలో ఆయన విఫలమైనట్లు భావిస్తున్నారు. పూర్వాంచల్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆప్ భారీ విజయాలు సాధించింది.

బిజెపి ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు మనోజ్ తివారీ మంగళవారంనాడు చెప్పారు. ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వినోదానికి పనికి వచ్చాయి. ఆయన పాటలను వాడుకుంటూ ఆప్ ఆయనను గేలి చేస్తూ వచ్చింది. 

మనోజ్ తివారీ 2013లో బిజెపిలో చేరారు. అతి స్వల్ప కాలంలో ఆయన ఢిల్లీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే స్థాయికి ఎదిగారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయనను అధ్యక్షుడిగా నియమించారు. ఆ సమయంలో విజయ్ గోయల్, రమే,్ బిధూరీ వంటి పాత కాపులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.