భార్య వేధింపులే భర్తను బలితీసుకున్నాయా? ఢిల్లీలో బేకరీ ఓనర్ సూసైడ్
ఢిల్లీలో ఓ బేకరీ యజమాని ఆత్మహత్య కలకలం రేపింది. భార్యతో విడాకుల వ్యవహారమై అతడి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
డిల్లీ : దేశ రాజధాని డిల్లీలోని ఓ ప్రముఖ బేకరీ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యకు దూరంగా వుంటున్న అతడు మంగళవారం సాయంత్రం ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్యతో విడాకుల వ్యవహారమై అతడి సూసైడ్ కి కారణంగా తెలుస్తోంది.
ఢిల్లీలోని ప్రముఖ కేఫ్ సహవ్యవస్థాపకుడు పునీత్ ఖురానా మంగళవారం సాయంత్రం మోడల్ టౌన్‌లోని కళ్యాణ్ విహార్ ప్రాంతంలో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గదిలోనే ఉరి వేసుకున్నట్లు... కుటుంబసభ్యులు చూసేసరికే ప్రాణాలు కోల్పోయి వున్నాడని తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందకుదింపారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... 38 ఏళ్ల వ్యాపారవేత్త పునీత్ తన విడాకుల వ్యవహారంలో చోటుచేసుకుంటున్న ఘటనలతో తీవ్ర కలత చెందాడు. ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు కూడా తన భార్యతో ఉమ్మడిగా ప్రారంభించిన బేకరీ వ్యాపారం గురించి ఫోన్‌లో మాట్లాడాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ సమయంలోనే వారిమధ్య మాటామాటా పెరిగిందని... చట్టపరంగా తీసుకుంటున్న విడాకులు, వ్యాపాారం గురించి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అప్పటికే తీవ్ర ఒత్తిడికి గురవుతున్న పునీత్ భార్యతో వాగ్వాదం తర్వాత మరింత కుంగిపోయాడు... ఇదే అతడి ఆత్మహత్యకు కారణమని కుంటుంబసభ్యులు చెబుతున్నారు.
పోలీసులు ఇఫ్పటికే పునీత్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతని మరణానికి దారితీసిన కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. పునీత్ ఆత్మహత్యకు సంబంధించి అతని భార్యను కూడా ప్రశ్నించాలని పోలీసులు యోచిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డిల్లీ పోలీసులు స్పష్టం చేసారు.
అతుల్ సుభాష్ లాగే పునీత్ కూడా..
ఈ కేసు ఇటీవల బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తుకు తెస్తుంది. 34 ఏళ్ల ప్రైవేట్ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ అతుల్ గత నెల డిసెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను 24 పేజీల ఆత్మహత్య లేఖ, వీడియో సందేశం బైటపడింది.
తన ఆత్మహత్యకు భార్య, ఆమె బంధువుల వేధింపులే కారణమని అతుల్ ఆరోపించాడు. అతడిపై భార్య, ఆమె బంధువులు పోలీస్ కేసులు పెట్టి వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పునీత్ ది కూడా అదే పరిస్థితి అయివుంటుదని అనుమానిస్తున్నారు. వ్యాపారం, విడాకుల విషయంలో భార్య ఒత్తిడే అతడి మరణానికి కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు.