ఓటరు గుర్తింపు  కార్డులు, హాల్ టికెట్లలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సినీనటులు, ఇతర ప్రముఖుల పేరు మీద అవి జారీ అయిన ఉదంతాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా జాతీయ ఉపాథి హామీ పథకానికి సంబంధించి మధ్యప్రదేశ్‌లో మరో గోల్‌మాల్‌ చోటుచేసుకుంది. జిర్న్యా జిల్లా పిపర్‌ఖేడా నకా పంచాయితీలో సర్పంచ్‌, కార్యదర్శి కలిసి బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పడుకోన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫోటోలతో పథకం లబ్ధిదారుల పేరిట నకిలీ జాబ్‌ కార్డులు సృష్టించి సొమ్ము చేసుకున్నారు.

ఆయా ఖాతాల నుంచి డబ్బు తీసుకునేందుకు నకిలీ జాబ్‌ కార్డులను ఉపయోగించారు. మోనూ దూబే జాబ్‌ కార్డుపై దీపికా పడుకోన్‌ ఫోటోను ఉపయోగించారు. మోనూ దూబే పనికి వెళ్లకపోయినా ఆయన పేరుతో నకిలీ జాబ్‌ కార్డు ఉపయోగించి 30 వేల రూపాయలను డ్రా చేశారు

ప్రతినెలా ఎలాంటి బెరుకు లేకుండా వీరిద్దరూ దందా సాగించుకుంటూ పోయారు. ఇక సోను అనే మరో లబ్ధిదారు పేరిట జాబ్‌ కార్డుపై జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫోటో ఉపయోగించారు. ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము నిజమైన లబ్ధిదారులకు చేరకపోవడంతో వీరి గుట్టు రట్టయింది.

జాతీయ ఉపాథి హామీ పథకం కింద తమకు ఎలాంటి పనులు రాకపోయినా సర్పంచ్‌, కార్యదర్శి, ఉపాథి హామీ అసిస్టెంట్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని కార్మికులు వాపోయారు. నకిలీ జాబ్‌ కార్డులు సృష్టించి ఆయా ఖాతాల నుంచి సొమ్మును మాయం చేసిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.