ఢిల్లీ: ఢిల్లీలోని భజన్ పుర ప్రాంతంలోని ఓ ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ విషయాన్ని పోలీసులు బుధవారంనాడు వెల్లడించారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందంటూ స్థానికులు పోలీసులకు ఉదయం 11.30 గంటలకు సమాచారం ఇచ్చారు 

దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని చూశారు. ఇంటి తలుపులు లోపలి నుంచి మూసి ఉన్నాయి. దీంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించి చూసేసరికి శవాలు కుళ్లిపోయి దుర్వాసన వేస్తున్నాయి. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఆత్మహత్య చేసుకున్నారా, ఎవరైనా చంపేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఐదు రోజుల క్రితం మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. 

సాంబూ అనే 43 ఏళ్ల ఈ రిక్షా డ్రైవర్ ఆరు నెలల క్రితం ఇంట్లో చేరాడు. అతనితో పాటు 38 ఏళ్ల భార్య సునీత, పిల్లలు ఉంటూ వస్తున్నారు. 16 ఏల్ల వయస్సు గల కూతురు, 14, 12 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వారంతా మరణించారు. ఇంట్లోకి దుండగులు ప్రవేశించి దోపిడీకి పాల్పడిన దాఖాలాలేవీ కనిపించడం లేదు.