కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ కవాతును రైతు సంఘాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

గణతంత్ర ట్రాక్టర్ పరేడ్ కార్యక్రమం హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రైతు సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి 1న.. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజున పార్లమెంట్‌ను ముట్టడిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.

ఢిల్లీ నలుమూలల నుంచీ తాము నడుచుకుంటూ పార్లమెంట్‌ వైపు ఊరేగింపుగా వెళ్లడానికి నిర్ణయించుకున్నామని క్రాంతికారీ కిసాన్‌ యూనియన్‌ నేత దర్శన్‌ పాల్‌ ప్రకటించారు. మరోవైపు నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీస్ కమీషనర్ మీడియాతో మాట్లాడారు.

రైతు సంఘాల నేతలు నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ర్యాలీపై ముందుగానే రైతుల సంఘాల నేతలతో 5 రౌండ్లు చర్చించామని సీపీ పేర్కొన్నారు. నిబంధనలకు రైతు నేతలు ఒప్పుకున్నాకే ర్యాలీకి అనుమతించామని కమీషనర్ వెల్లడించారు.

రిపబ్లిక్ డే రోజున ర్యాలీ వద్దన్నా రైతు నేతలు వినలేదని... రైతు సంఘాల నేతలు ప్రసంగాలు రెచ్చగొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. పోలీసుల వద్ద అన్ని అవకాశాలున్నప్పటికీ సంయమనం పాటించామని సీపీ వెల్లడించారు.

ప్రాణనష్టం జరగకూడదనే సంయమనం పాటించామని.. అగ్రిమెంట్ ప్రకారం తాము సంయమనం పాటించామని ఆయన గుర్తుచేశారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో 394 మంది పోలీసులు గాయపడ్డారని... ఇప్పటికే చాలా మంది ఆసుపత్రుల్లో ఉన్నారని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు.