చెన్నై:  అతడో ఎమ్మెల్యే... కావాల్సినంత డబ్బు అంతకు మించిన పలుకుబడి వుంది. అతడు కోరుకుంటే కోట్ల కట్నమిచ్చి మరీ పిల్లనిచ్చే సంబంధాలు వస్తాయి. అలాంటి అవకాశాన్ని కాదని ఓ సామాన్య అర్చకుడి కూతురిని ప్రేమించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ప్రభు(34). అయితే ఎమ్మెల్యేను అల్లుడిగా అంగీకరించడానికి ఇష్టపడని పిల్ల తండ్రి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కల్వకూరిచి నియోజకవర్గ ఎమ్మెల్యే  ప్రభు ఓ అర్చకుడి కూతురిని ప్రేమించాడు. బీఏ రెండో సంవత్సరం చదువుతున్న సౌందర్య కూడా ఎమ్మెల్యేను ప్రేమించింది. కానీ వీరి కులాలు వేరు కావడం, ఇద్దరి మధ్యా వయసు తేడా(అమ్మాయికి 19, అబ్బాయికి 34ఏళ్లు)వుండటంతో అమ్మాయి తండ్రి ఈ ప్రేమను అంగీకరించలేదు. 

దీంతో ఎమ్మెల్యే ప్రభు కేవలం తన సన్నిహితులను సమక్షంలో సోమవారం సౌందర్యను వివాహమాడాడు.  ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన  కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ఇది తట్టుకోలేక అమ్మాయి తండ్రి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  దీంతో ఎమ్మెల్యే పెళ్లి తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.