లాకప్ డెత్, అత్యాచారం ఆరోపణలపై జిల్లా ఎస్పీతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఆరు కానిస్టేబుళ్లను రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో పాటు జ్యూడిషియల్ విచారణకు ఆదేశించింది.

దీనిపై మృతుడి అన్న, బాధితురాలి భర్త మాట్లాడుతూ... చురు పోలీసులు దొంగతనం కేసులో నా తమ్ముడిని జూన్ 30న అదుపులోకి తీసుకున్నారని.. ఈ నెల 3న నా భార్యను స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపాడు.

6వ తేదీ రాత్రి తన తమ్ముడిని చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేశారని.. ఈ ఘటనకు సాక్ష్యంగా ఉన్న తన భార్యపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడటంతో పాటు చేతి గోర్లను పీకేసి హింసించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

దాదాపు ఎనిమిది రోజుల పాటు తన భార్యను నిర్బంధించి తమ్ముడు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత విడిచిపెట్టారని అతను వాపోయాడు. మృతుని సోదరి మాట్లాడుతూ... 6వ తేదీన పోలీసులు తన తమ్ముడిని గ్రామానికి తీసుకొచ్చి.. ఇదే నీ చివరి చూపని చెప్పారని, 8 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన వదిన ఆరోగ్య పరిస్ధితి చాలా ఘోరంగా ఉందని కన్నీటి పర్యంతమైంది.

కాగా.. ఈ దొంగతనం కేసులో మరిది, వదినలను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని తమ దృష్టికి వచ్చిందని చురు జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు.

మృతుని పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసు దర్యాప్తు చేస్తామని.. మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చామన్నారు. అత్యాచారం కేసులో బాధిత మహిళ వాంగ్మూలం తీసుకున్నామని.. క్రైమ్ బ్రాంచ్ అదనపు డీజీపీ వెల్లడించారు.