స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఓ దళిత యువతి(19) పై దాదాపు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బరేలీకి చెందిన ఓ యువతి.. గత నెల 31వ తేదీన.. తన స్నేహితులైన ఇద్దరు అబ్బాయిలతో కలిసి స్కూటీ పై బయటకు వెళ్లింది. ఆ సమయంలో నిందితుల్లో ఒకరు వారిని అడ్డగించాడు. తర్వాత తన మిగిలిన స్నేహితులు ఆరుగురిని అక్కడికి పిలిచాడు. ఆ తర్వాత  యువతి ఇద్దరు స్నేహితులను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం.. వారంతా కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత యువతిని బలంగా కొట్టి.. ఆమె వద్ద ఉన్న డబ్బును గుంజుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో సదరు యువతి బాగా భయపడిపోయింది. దీంతో... దీని గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. తర్వాత ధైర్యం చేసి తన సోదరితో జరిగిన విషయం చెప్పింది.

తన సోదరి ఇచ్చిన ధైర్యంతో తాజాగా యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు. అయితే.. వారిని పట్టుకునే క్రమంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించారు.

కానీ పోలీసులు వారిని వెంబడించి ఒకరి కాలిపై తుపాకీతో  కాల్చారు. దీంతో.. వారు పోలీసులకు లొంగిపోయారు. గాయపడిన నిందితుడిని ఆస్పత్రిలో చేర్పించారు. అరెస్టు అయిన వారిని విశాల్ పటేల్(22), అనుజ్ పటేల్(23) గా గుర్తించారు. వికాస్ అనే వ్యక్తి అత్యాచార ఘటన మొత్తాన్ని ఫోటోలు తీసినట్లు గుర్తించారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.