కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. అనేక దేశాల్లో రకరకాల వ్యాక్సిన్ లు చివరిదశల్లో ఉన్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభించాయి. మన దేశంలో కూడా వాక్సిన్ డ్రైరన్ ప్రారంభమయ్యింది. 

ఇదిలా ఉండగా కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే టీకాకు అనుమతి మంజూరు చేసే అంశంపై నిపుణుల కమిటీ నేడు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 
కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసరం వినియోగ అనుమతుల కోసం సీరమ్ సంస్థ చేసిన దరఖాస్తును పరిశీలించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల కమిటీ నేడు సమావేశం కానుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఆస్ట్రాజెనెకా టీకాకు యూకేలో అనుమతి లభించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రా జెనెకా భాగస్వామ్యంతో భారత్ లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ పేరుతో టీకాను తయారుచేస్తోంది. కాగా భారత్ లో అత్యవసర అనుమతుల కోసం ఇప్పటివరకు సీరంతో పాటు భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. 

కాగా, ప్రయోగాల విషయమై మరింత సమాచారం కావాలని నిపుణుల కమిటీ ఈ సంస్థలను కోరింది. అయితే ఆ వివరాలను సీరమ్ అందించింది. ఫైజర్ మాత్రం మరింత సమయం కావాలని కోరింది. దీంతో ఫైజర్ దరఖాస్తును నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. 

మరోవైపు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ కే తొలి అనుతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బ్రిటన్ లోనూ ఈ టీకాను ఆమోదం లభించిన నేపథ్యంలో భారత్ లో అనుమతులకు మార్గం మరింత సుగమమైనట్లు తెలుస్తోంది.

కాగా టీకా అనుమతులపై సీరమ్ సానుకూలంగా ఉంది. అటు పంపిణీకి కూడా సర్వ సన్నద్ధమైంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల డోసులను సిద్ధంగా ఉంచినట్లు ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.