దేశంలో కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రస్తుతం అమల్లో వున్న లాక్‌డౌన్ ఆంక్షలను మరో నెలరోజులపాటు పొడిగించింది. జనవరి 31 వరకు ఇవి కొనసాగుతాయని బుధవారం పేర్కొంది
దేశంలో కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రస్తుతం అమల్లో వున్న లాక్‌డౌన్ ఆంక్షలను మరో నెలరోజులపాటు పొడిగించింది.
జనవరి 31 వరకు ఇవి కొనసాగుతాయని బుధవారం పేర్కొంది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్త వైరస్ ఆనవాళ్లు కనిపించలేదని ఓ అధికారి తెలిపారు. గత కొన్నిరోజుల నుంచి యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 30 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, వారిలో ఎవరికి కూడా కొత్త రకం కరోనా నిర్థారణ కాలేదన్నారు.
ఇక ఇప్పటికే అనుమతించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని డిసెంబర్ 29న జారీ చేసిన సర్క్యులర్ పేర్కొంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు ఉద్ధవ్ సర్కార్ అనేక లాక్‌డౌన్ పరిమితులను సడలించిన సంగతి తెలిసిందే.
నవంబరులో ప్రార్థనా మందిరాలను తిరిగి తెరిచేందుకు, 9 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ప్రారంభించేందుకు అనుమతించింది. కాగా దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్‌లో వుంది.
ఇప్పటి వరకు అక్కడ 19,25,066 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 3,018 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. 69 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 49,373కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 54,537 యాక్టివ్ కేసులున్నాయి
