కరోనా ఓ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. దీనికితోడు ఆ కుటుంబం నిర్లక్ష్యం కొత్త పెళ్లికొడుకును బలి తీసుకుంటే.. కొత్త పెళ్లి కూతురితో సహా తొమ్మిందిమందిని కరోనా మహమ్మారి పాలు చేసింది. యూపీలో జరిగిన ఈ సంఘటనతో అక్కడి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.  

వివరాల్లోకి వెడితే.. యూపీలోని ఫిరోజాబాద్‌లో నాగలా సావంతి గ్రామంలో ఓ కొత్తపెళ్లికొడుకు మృతి చెందాడు. ఆ తరువాత వధువుతోపాటు వారి కుటుంబంలోని 9 మందికి కరోనా సోకినట్లు తేలింది. నవంబరు 25న మృతుడి వివాహం జరిగింది. డిసెంబరు 4న కొత్త పెళ్లికొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. 

తీరా చనిపోయాక తెలిసిన విషయం ఏంటంటే అతనికి అప్పటికే కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ, ఎటువంటి పరీక్షలు చేయించుకోలేదు. దీంతో నెల రోజుల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లికొడుకు తరపువారు చెప్పిన వివరాల ప్రకారం పెళ్లి అయిన తరువాత పెళ్లికొడుకుకు జలుబు, జ్వరంలాంటి లక్షణాలు కనిపించాయి. అయినప్పటికీ టెస్ట్ చేయించుకోలేదు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే ఆరోగ్యం విషమించి, డిసెంబరు 4న అతను మృతి చెందాడు. 

దీంతో వారి ఇంట్లోని వారంతా కరోనా టెస్టులు చేయించుకున్నారు. కొత్త పెళ్లి కూతురితో మొత్తం 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒకే కుటుంబంలోని 9 మందికి కరోనా సోకడంతో స్థానిక వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.