కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది అవస్థలు పడుతున్నారు. కాగా.. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఆ దిశగా మన దేశంలో అడుగులు పడుతున్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వ్యాక్సినేషన్ తొలిదశలో ప్రతీ నలుగురిలో ఒకరికి టీకా వేయనున్నారు. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి‌లో కరోనా వ్యాక్సిన్ డోసేజీలను భద్రపరచనున్నారు. ఇక్కడి నుంచి పాలీక్లీనిక్‌లకు వ్యాక్సిన్ డోసేజీలను తరలించనున్నారు. వ్యాక్సినేషన్ తొలి దశలో ఢిల్లీలోని మొత్తం జనాభాలోని 20 నుంచి 25 శాతం మందికి టీకా వేయనున్నారు.

ఈ విషయమై ఢిల్లీ ఆరోగ్య విభాగానికి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దేశంలోని మిగిలిన పట్టణాలతో పోల్చిచూస్తే, ఢిల్లీలో మధుమేహం, బీపీ, క్యాన్సర్, హృద్రోగం, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు అధికశాతంలో ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ముందుగా కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.