భార్యభర్తల మధ్య జరిగే గొడవల్లో సాధారణంగా ఎవరూ తలదూర్చరు. చివరకు వాళ్లే కలిసిపోయి.. మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చినవాళ్లనే తప్పుపడతారు. ఆ విషయం తెలీక పాపం ఓ పోలీసు భార్యభర్తల మధ్య దూరాడు. చివరకు చెంప దెబ్బలు తిన్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గిండి స్టేషన్‌ కానిస్టేబుల్‌ శశికుమార్, జోసఫ్‌ గురువారం వేకువజామున 1.30 గంటల సమయంలో గస్తీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో గిండి పడువాంకరై, మసూది కాలనీ 17వ వీధికి వెళ్లారు. అక్కడ భార్య, భర్త గొడవపడుతూ ఉన్నారు. తన భర్త మద్యం సేవించి వచ్చి తనను వేధిస్తున్నట్లు భార్య తెలిపింది. 

అప్పుడు శశికుమార్‌ ఆమె భర్త వద్ద విచారించడానికి వెళ్లాడు. తీవ్ర మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి నా భార్య నా ఇష్టం అంటూ.. కానిస్టేబుల్‌ శశికుమార్‌ చెంప పగులగొట్టాడు. అతని పేరు ఉమర్‌ అని తెలిసింది. దీంతో అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మత్తులో ఉండడంతో ఉమర్‌ను గురువారం విచారణ చేపట్టారు.