న్యూఢిల్లీ: సరైన సమయంలో లాక్ డౌన్ విధించడం వల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

మంగళవారం నాడు సాయంత్రం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి  ప్రసంగించారు. లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోడీ ఐదు దఫాలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

కరోనాపై పోరాటంలో రెండో విడత ఆన్‌లాక్ 2.0 లోకి ప్రవేశిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. వర్షాలు పడే సమయంలో ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.ఇతర దేశాలతో పోలిస్తే కరోనా పోరాటంలో మనం మెరుగ్గా ఉన్నామని ఆయన ప్రకటించారు. లాక్ డౌన్ అనేక మంది ప్రజలను కాపాడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సరైన సమయంలో లాక్ డౌన్ విధించడం వల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించినట్టుగా ఆయన చెప్పారు.  కేసులు పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని మోడీ కోరారు.  ప్రతి ఒక్కరూ కూడ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.

ఈ కష్టకాలంలో పేదలు ఆకలితో లేకుండా ఉండకుండా చూసుకొన్నామని ఆయన చెప్పారు. రూ. 1.72 కోట్లను పేద ప్రజలకు కేటాయించామన్నారు. రూ. 50 వేల కోట్లను గరీబ్ కళ్యాణ్ పథకానికి వెచ్చించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ ఏడాది నవంబర్ వరకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. పేదల ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు జమ చేసిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వన్ నేషన్ వన్ రేషన్ విధానంతో వలస కూలీలకు లబ్ది కలుగుతోందన్నారు. పేదలు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్ తీసుకొనే వెసులుబాటు దక్కుతోందన్నారు. నవంబర్ వరకు పేదలకు ఉచిత రేషన్ ఇస్తామని ఆయన ప్రకటించారు.

ప్రతి కుటుంబంలో ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం అందిస్తామని చెప్పారు. ఉచిత రేషన్ కోసం రూ. 90 వేల కోట్లను ఖర్చు చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు.నవంబర్ వరకు పేదలకు ఉచితంగా రేషన్ ను అందిస్తామన్నారు.