coronavirus : నేటి వరకు ఒక్క ఒమిక్రాన్ మరణం కూడా సంభవించలేదు- ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్
దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వల్ల ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. కరోనా కేసులు పెరిగినా.. వాటిని ఎదుర్కొవడానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఢిల్లీలో నేడు దాదాపు 20 వేల కోవిడ్ -19 (covid -19) కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ రాజధానిలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant) వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య తక్కువగా ఉందని, వ్యాధి తీవ్రత కూడా చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు.
ఢిల్లీలో కోవిడ్ -19 (COVID-19) కేసులు పెరిగినా ఎదుర్కొవడానికి ఆప్ (AAP) ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ముందే కరోనాను ఎదుర్కొవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరికలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. గతంలో ఢిల్లీలో 17,000 కేసులు ఉన్నప్పుడు, రోజు వారీ మరణాలు ప్రాతిపదికన 200 కంటే ఎక్కువగా ఉండేవని అన్నారు. అయితే ఈ సారి మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
కరోనా టెస్టులు పెరిగాయి..
దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా టెస్ట్‌లు పెంచామని, అందుకే అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయని మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. అందరూ బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్కులు ధరించాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని కోరారు. లాక్ డౌన్ విధించడం కంటే ఇవి పాటించడం వల్లే కేసులు నియంత్రణలో ఉంటాయని అన్నారు. లాక్ డౌన్ కంటే ఈ నిబంధనలు పాటించడమే చాలా మేలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,335 కేసులు నమోదయ్యాయి. 2021 మే నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. అయితే కరోనా వల్ల గడిచిన 24 గంటల్లో 9 మంది మరణించారని తెలిపింది. శుక్రవారం నుంచి ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ (weekend curfew) ప్రారంభమైంది. ఈ సమయంలో కోవిడ్ -19 (COVID- 19) నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘణను నియంత్రించడానికి ఢిల్లీ పోలీసులు, అధికారులు నిఘా పెంచారు. ఈ వీకెండ్ కర్ఫ్యూ (weekend curfew) రాత్రి 10 గంటల నుంచి ప్రాంరభమై, సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం హెల్త్ బులిటిన్ లో పేర్కొంది. ఏడు నెలలు తరువాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే గత 24 గంటల్లో కరోనాతో పోరాడతూ 285 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పొయిన వారి సంఖ్య 4,83,178 కి చేరింది. మొత్తం కరోనా బారినపడ్డవారి సంఖ్య 3,53,68,372కు చేరింది. 24 గంటల్లో కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,72,169 యాక్టివ్ కేసులు ఉన్నాయి.