న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.  అయితే తాజాగా కొన్ని రాష్ట్రాలో ఈ వైరస్ ప్రభావం బాగా తగ్గి చాలా తక్కువ కేసులు బయటపడుతున్నాయి. దీంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్న ఆయా రాష్ట్రాలకు, కేంద్రానికి నీతి ఆయోగ్ సభ్యులు(ఆరోగ్యం) డాక్టర్ వినోద్ పాల్ కీలక హెచ్చరిక చేశారు. 

రానున్న శీతాకాలంలో కరోనా వైరస్ మరింత ఎక్కువగా వ్యాప్తిచెందే అవకాశం వుందని కోవిడ్19 నిపుణులు బృందం, డాక్టర్ పాల్ తెలిపారు. ఈ కాలంలో సాధారణంగానే శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి వాటితో పాటే కరోనా కూడా వేగంగా వ్యాప్తి చెందేఅవకాశాలున్నాయన్నారు.  కాబట్టి రాబోయే మూడు నాలుగు నెలల పాటు ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. 

చలి వాతావరణంలో కరోనాకు అనువైనవిగా... అందువల్ల అది అధికంగా ప్రభావం చూపిస్తుందని అన్నారు. కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా వుండాలని... వృద్దులు బయటకు రాకుండా వుండాలని, బయటకు వచ్చే సమయంలో ప్రతిఒక్కరు మాస్కులు, శానిటైజర్లు వాడుతూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. సాధయమైనంత వరకు ఇంట్లోనే వుంటూ తమ కుటుంబాన్ని, సమాజాన్ని కరోనా బారినుండి కాపాడాలని డాక్టర్ పాల్ సూచించారు.