ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ డోసేజీలను అన్ని దేశాలకంటే ఎక్కువగా భారత్ బుక్ చేసింది. భారత్ 160 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు బుక్ చేసిందని డ్యూక్ యూనివర్శిటీకి చెందిన లాంచ్ అండ్ స్కేల్ స్పీడోమీటర్ వెల్లడించింది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. కరోనా కట్టడికోసం ఓ వైపు అన్నిరకాల చర్యలు తీసుకుంటూనే మరోవైపు వ్యాక్సిన్ కోసం ముందస్తు బుకింగ్ లు చేసుకుంటున్నాయి. 

అన్నిదేశాల్లో మాదిరిగానే భారత్‌లోనూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దాని పంపిణీ కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లను ముమ్మరం చేశారు. తాజాగా భారత్‌లో కరోనా వ్యాక్సిన్ బుకింగ్‌నకు సంబంధించిన ఒక విషయం వెల్లడయ్యింది. 

కరోనా వ్యాక్సిన్ బుకింగ్ విషయంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ ఇప్పటి వరకూ కరోనా వ్యక్సిన్‌కు సంబంధించి 160 కోట్ల కన్ఫర్మ్ డోసేజీలను ఆర్డర్ చేసింది. 

డ్యూక్ యూనివర్శిటీకి చెందిన లాంచ్ అండ్ స్కేల్ స్పీడోమీటర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం భారత్...ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ డోసేజీలను అన్ని దేశాలను మించి అత్యధికంగా బుక్ చేసింది. 

భారత్... ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్‌ను 500 మిలియన్ డోసులు (50 కోట్ల డోసులు) బుక్ చేసింది. అమెరికా కూడా ఇదే స్థాయిలో వ్యాక్సిన్ డోసులను బుక్ చేసింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్‌ను యూరప్‌తో పాటు పలు దేశాలు కూడా బుక్ చేశాయి.