సన్‌ఫీస్ట్ ప్యాకెట్‌లో ఒక్క బిస్కెట్ తక్కువైందని కేసు.. వినియోగదారుడికి రూ. 1 లక్ష ఇవ్వాలని కంపెనీకి ఆదేశం
సన్‌ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్‌లో ఒక్క బిస్కెట్ తక్కువైందని ఓ వినియోగదారుడు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. బిస్కెట్ కవర్ పై 16 బిస్కెట్లు ఉంటాయని ప్రస్తావించారని, కానీ, లోపల 15 బిస్కెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. ఈ ఆరోపణలు రుజువయ్యాక కంపెనీకి రూ. 1 లక్ష ఫైన్ వేసింది.

న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ తయారు చేసే సన్‌ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్‌లో ఒక్క బిస్కెట్ తక్కువ వచ్చిందని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కన్జ్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించాడు. దీంతో ఆ కోర్టు ఐటీసీ కంపెనీకి రూ. 1 లక్ష జరిమానా వేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఐటీసీ లిమిటెడ్ ఫుడ్ డివిజన్ సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తున్నది. బ్యాచ్ నెంబర్ 0502సీ36 ప్యాకెట్‌లలో కవర్ పైన 16 బిస్కెట్లు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నదని, కానీ, అందులో 15 బిస్కెట్లే ఉన్నాయని చెన్నైకి చెందిన ఫిర్యాదుదారు పీ దిల్లిబాబు ఆరోపించాడు. అయితే.. కంపెనీ మాత్రం తాము బిస్కెట్ల లెక్క చొప్పున కాకుండా.. దాని బరువు ఆధారంగా విక్రయిస్తామని, అందులో బిస్కెట్ల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా బరువు చూపినంతనే 76 గ్రాములే ఉంటుందని వివరించింది. కానీ, కోర్టు ఆ కంపెనీ వాదనలను కొట్టివేసింది.
ఆ బిస్కెట్ ప్యాక్‌ను బరువు ఆధారంగానే అమ్ముతామని కంపెనీ చెబుతున్నదని, కానీ, ఆ బిస్కెట్ ప్యాకెట్ రాపర్ పై స్పష్టంగా బిస్కెట్ల సంఖ్య పేర్కొని ఉన్నదని కోర్టు చెప్పింది. ఇది స్పష్టంగా వినియోగదారులను తప్పుదారి పట్టించినట్టే అవుతుందని స్పష్టం చేసింది. వినియోగదారులు ముందుగా ప్యాక్ పై ఎన్ని బిస్కెట్లు వస్తాయనేదే చూస్తాడని, దాని బరువు ఎంత అనేది ప్రధానంగా ఉండదని వివరించింది. ఆ బిస్కెట్ల సంఖ్యనే వినియోగదారులను సంతృప్తి పరిచే, కొనుగోలుకు ఆకర్షించే అంశం అని తెలిపింది.
Also Read: ముంబయి పోలీసులను పరుగుపెట్టించిన మతిస్థిమితంలేని మహిళ.. 38 సార్లు ఫేక్ బాంబ్ కాల్స్
కాబట్టి, తయారీదారు, మార్కెటర్ తప్పుడు వాణిజ్య విధానాన్ని ఎంచుకున్నట్టు అర్థం అవుతున్నదని, ఈ పొరపాటు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నదని వివరించింది. ఇందులో తప్పు జరిగినట్టు వినియోగదారుడు స్పష్టంగా నిరూపించాడని తెలిపింది. కంపెనీపై రూ. 100 కోట్ల ఫైన్, విక్రయించిన స్టోర్ పై రూ. 10 కోట్ల ఫైన్ పరిహారంగా వేయాలని కంప్లైనెంట్ కోరాడు. కానీ, ఈ అమౌంట్ చాలా ఎక్కువ అని, ఆయన డిమాండ్‌ను కోర్టు తిస్కరించింది. వినియోగదారుడికి రూ. 1 లక్ష పరిహారంగా చెల్లించాలని కోర్టు ఐటీసీ కంపెనీని ఆదేశించింది. మరో పది వేలు ఆయన లిటిగేషన్ ఖర్చులకు ఇవ్వాలని తెలిపింది.