Rajiv Gandhi Assassination: మాజీ ప్ర‌ధాని హ‌త్య కేసులో నిందితుడ్ని విడుద‌ల చేయ‌డాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా ఖండించారు. ఇదో దుర‌దృష్ట ఘ‌ట‌న అని, ఇవాళ దేశానికి దుర్దిన‌మ‌ని ర‌ణ‌దీప్ అభివ‌ర్ణించారు. 

Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిలో ఒకరైన ఏజీ పేరారివాలన్‌ను విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం చాలా బాధాకరమని కాంగ్రెస్ బుధవారం విమర్శించింది. సుప్రీంకోర్టు నిర్ణయం మమ్మల్ని తీవ్ర బాధకు గురిచేస్తోందనీ, తీవ్రవాదం, ప్రధానమంత్రి హత్యకు పాల్పడిన వారిని ఇలా విడుదల చేస్తే.., ఈ దేశంలో చట్టబద్ధత, సమగ్రతను ఎవరు నిలబెడతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా ప్ర‌శ్నించారు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన పేరరివాలన్‌ను సంతృప్తికరమైన ప్రవర్తన, వైద్య రికార్డులు, జైల్లో సాధించిన విద్యార్హతల ఆధారంగా విడుదల చేయాలని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది. ఈ నిర్ణ‌యంపై సుర్జేవాలా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. “ఇదేనా మీ ద్వంద్వ వైఖరి, ఉగ్రవాదంపై రెట్టింపు చేయ‌డమా? ఒక ఉగ్రవాదిని, దేశ మాజీ ప్రధానిని హంతకులను విడుదల చేయడమేమిటి.. ఆ త‌ప్పులో మీరు కూడా భాగస్వాములు కాబోతున్నారా? అని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

చిన్న చిన్న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇలాంటి అనారోగ్యక‌ర‌ వాతావ‌ర‌ణాన్ని సృష్టించింద‌ని, మాజీ ప్ర‌ధానిని చంపిన వారిని విడుద‌ల చేయించింద‌ని మండిప‌డ్డారు. మాజీ ప్ర‌ధాని హ‌త్య కేసులో నిందితుడ్ని విడుద‌ల చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని, ఇదో దుర‌దృష్ట ఘ‌ట‌న అని అన్నారు. ఇవాళ దేశానికి దుర్దిన‌మ‌ని ర‌ణ‌దీప్ అభివ‌ర్ణించారు. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. 

ప్రభుత్వం నియమించిన గవర్నర్‌ తీసుకోని నిర్ణయం కారణంగా హంతకుల్లో ఒకరిని విడుదల చేశారని సూర్జేవాలా పేర్కొన్నారు. ఇప్పుడు దోషులందరినీ విడుదల చేయ‌డ‌మే జాతీయవాదమా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండటమే మీ మార్గమా? అని నిలాదీశారు. తమిళనాడులో అప్పటి ఏఐఏడీఎంకే-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం 2018లో గాంధీ హంతకులను విడుదల చేయాలని సిఫారసు చేసిందని సూర్జేవాలా విమ‌ర్శించారు. ఈ విషయం అప్పటి తమిళనాడు గవర్నర్‌కు పంపబడింది, ఆ త‌రువాత ఆ ప్ర‌తిపాద‌న‌ను భారత రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.