కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మహారాష్ట్ర పీసీసీ సంచలన లేఖ రాసింది. మహావికాస్ అగాఢీలోని శివసేన, ఎన్సీపీలు కాంగ్రెస్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సోనియాకు ఫిర్యాదు చేసింది.

మన పార్టీని పూర్తిగా పక్కనపెట్టేస్తున్నారని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. ఎన్సీపీ, శివసేనలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని, చెదల్లా పాడుచేస్తున్నారని మండిపడింది. ముంబై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విశ్వబంధు రాయ్ ఈ మేరకు సోనియాకు లేఖ రాశారు.

ఎన్సీపీ, శివసేనలు ఓ వ్యూహం ప్రకారం కాంగ్రెస్‌ను దెబ్బ తీస్తున్నాయని ఆయన ఆరోపించారు. వారి వారి పార్టీలను విస్తరించుకునే పనిలో నిమగ్నమయ్యాయని విశ్వబంధు చెప్పారు.

దీనికి అడ్డుకట్ట వేయడంలో కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారని విశ్వబంధు ఈ లేఖలో సోనియా దృష్టికి తీసుకెళ్లారు. 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చెప్పిన ఏ హామీనీ మహా వికాస్ నెరవేర్చడం లేదని, కాంగ్రెస్ నుంచి నేతలు బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని విశ్వబంధు కోరారు.

సంకీర్ణ ధర్మాన్ని పాటించాలని శివసేన, ఎన్సీపీకి సూచించాలని విశ్వబంధు ఈ లేఖ ద్వారా సోనియా గాంధీని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2022లో జరిగే బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది.