కేంద్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో నిధులు బదిలీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ  వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని, ఆర్ధిక మంత్రి స్వయంగా సృష్టించుకున్న ఆర్ధిక విపత్తు నుంచి ఎలా బయటపడాలో వారికి తెలియట్లేదన్నారు. ఈ చర్యను దోపిడిగా పోలుస్తూ ధ్వజమెత్తారు.

మెడికల్ షాప్ నుంచి బ్యాండ్‌ఎయిడ్‌ను దోచుకుని తుపాకీ గాయానికి వేసుకున్నట్లుగా ఉందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి #RBILooted అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు.

కాగా... మందగమనం వైపుగా వెళ్తున్న భారత ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్లు, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్‌బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది.

2018-19 ఏడాదికి గాను మొత్తం రూ.1,76,051 కోట్లను బదిలీ చేయడానికి గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్‌బీఐ కేంద్ర బోర్డు అనుమతి తెలిపింది. సవరించిన ఆర్ధిక మూలధన ప్రణాళిక ప్రకారం.. ఇందులో రూ.1,23,414 కోట్లు అదనపు నిధులు కాగా.. రూ.52,637 కోట్లు అదనపు కేటాయింపులుగా ఆర్‌బీఐ తెలిపిన సంగతి తెలిసిందే. 

కేంద్రాన్ని ఆదుకున్న ఆర్‌బీఐ: రూ.1.76 లక్షల కోట్ల బదిలీకి గ్రీన్‌సిగ్నల్