మందగమనం వైపుగా వెళ్తున్న భారత ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్లు, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్‌బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది.

2018-19 ఏడాదికి గాను మొత్తం రూ.1,76,051 కోట్లను బదిలీ చేయడానికి గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్‌బీఐ కేంద్ర బోర్డు అనుమతి తెలిపింది. సవరించిన ఆర్ధిక మూలధన ప్రణాళిక ప్రకారం.. ఇందులో రూ.1,23,414 కోట్లు అదనపు నిధులు కాగా.. రూ.52,637 కోట్లు అదనపు కేటాయింపులుగా ఆర్‌బీఐ తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఎంత మేర మూలధన నిధులను ఉంచుకోవాల్న దానిపై బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఈ నిధుల బదిలీ జరిగింది. ఆర్ధిక వ్యవస్థకు జవసత్వాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి ఈ నిధుల బదిలీ గట్టి దన్నుగా నిలుస్తుందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు.

ఐదేళ్ల కనిష్టానికి చేరిన వృద్ధి రేటును మెరుగుపరచడంతో పాటు ద్రవ్యోలోటును జీడీపీలో 3.3 శాతం కంటే అధికం కాకుండా చూడటం కోసం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు అదనపు నిధుల విషయంలో మోడీ ప్రభుత్వానికి.. మాజీ ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అదనపు నిధులను సమీక్షించడం కోసం 2018 నవంబర్‌ నాటి బోర్డు సమావేశంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అయితే ఈ కమిటీ ఏర్పాటు కావడానికి ముందే ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. దీంతో కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో చర్చించిన అనంతరం డిసెంబర్ 26న ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు.

2013-14 నుంచి ఆర్‌బీఐ తన ఖర్చుచేయదగ్గ ఆదాయంలో 99 శాతాన్ని ప్రభుత్వానికి ఇస్తూ వస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో డివిడెండ్ కింద రూ. 95,414 కోట్లు లభిస్తోంది. గతేడాది రూ.74,140.37 కోట్లు డివిడెండ్ కింద వచ్చాయి.

ఆర్‌బీఐ తన పరపతి, ఆర్ధిక, స్ధిరత్వ నష్టభయాల కోసం కేటాయించి సొమ్ము... దేశానికి అవసరమైనప్పుడు పనికి రావాల్సిన అవసరం ఉందని కమిటీ సిఫారసు చేసింది. అందుకు తగ్గట్టుగానే బ్యాలెన్స్ సీట్లు, పరపతి, ఆర్ధిక స్ధిరత్వ నష్టభయాలు, రుణ, కార్యకలాపాల నష్టభయాలకు కేటాయించాల్సిన వాటిపై సిఫారసులు చేసింది.

వీటికి తన 578వ సమావేశంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయ, దేశీయ సవాళ్లు, ఆర్‌బీఐకి చెందిన వివిధ విభాగాల కార్యకలాపాలను బోర్డు సమీక్షించింది.