Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కు ఎంపీ గౌరవ్ వల్లభ్ రాజీనామా.. సనాతన వ్యతిరేక నినాదాలు చేయలేమంటూ వ్యాఖ్య..

లోక్ సభ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నిన్న బాక్సర్ విజేందర్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరగా.. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కూడా ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

Congress MP Gaurav Vallabh resigns Anti-sanatan slogans cannot be raised..ISR
Author
First Published Apr 4, 2024, 1:23 PM IST

లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు రాసిన లేఖలో వెల్లడించారు. ఆ లేఖను ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పై గౌరవ్ వల్లభ్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ దిక్కులేనిది అని, కుల గణన వంటి కారణాలను ప్రస్తావిస్తూ సనాతన వ్యతిరేక నినాదాలు చేయలేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేడు దిశా నిర్దేశం లేకుండా ముందుకు సాగడం తనకు రుచించడం లేదన్నారు. ‘‘నేను సనాతన వ్యతిరేక నినాదాలు చేయలేను. దేశ సంపద సృష్టికర్తలను దూషించలేను. కాంగ్రెస్ పార్టీ అన్ని పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా.. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని గౌరవ్ వల్లభ్ నిర్వహించారు. ఆర్థిక అంశాలపై సమర్థవంతంగా తన గొంతును వినిపించారు. 2023లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి 32 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

2019లో జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ ఈస్ట్ లో పోటీ చేసిన గౌరవ్ వల్లభ్.. 18 వేలకు పైగా ఓట్లు సాధించి అప్పటి సీఎం రఘుబర్ దాస్, సరయూ రాయ్ ల తరువాత మూడో స్థానంలో నిలిచారు.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత, బాక్సర్, ఒలింపిక్ పతక విజేత, ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ప్రొఫెషనల్ బాక్సర్ అయిన విజేందర్ సింగ్ ప్రస్తుతం వివిధ దేశాల్లో క్రీడల్లో పాల్గొంటున్నారు. గత వారం ఆయన ‘ఎక్స్’ చేసిన పోస్ట్ లో ‘ప్రజలు ఎక్కడ కోరుకున్నా పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios