కాంగ్రెసు గెలుపు: మేఘాలయలో కర్ణాటక పునరావృతం?

Congress leading in Ampati seat in Meghalaya
Highlights

మేఘాలయలోని అంపటి శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థి మియానీ డి షిరా విజయం సాధించారు.

న్యూఢిల్లీ: మేఘాలయలోని అంపటి శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థి మియానీ డి షిరా విజయం సాధించారు. దీంతో మేఘాలయలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరించింది. రెండు స్థానాల్లో విజయం సాధించిన షిరా తండ్రి ముకుల్ సంగ్మా ఆ నియోజకవర్గం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో ఆ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. 

ఈ విజయంతో కాంగ్రెసు స్థానాలు 21కి పెరిగాయి. దీంతో నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతారని అంటున్నారు. కర్ణాటకలో మాదిరిగా అతి పెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు కోరుతారని అంటున్నారు. 

ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 60 స్థానాలు గల అసెంబ్లీలో 21 స్థానాలు గెలుచుకుంది. రెండు చోట్ల పోటీ చేసిన ముకుల్ సంగ్మా అంపటి స్థానానికి రాజీనామా చేయడంతో కాంగ్రెసు సీట్లు 20కి పడిపోయాయి. 

మెజారిటీకి మరో 11 స్థానాలు కావాల్సిన స్థితిలో కాంగ్రెసు అధికారానికి దూరమైంది. కోన్నాడ్ సంగ్మా బిజెపి మద్దతుతో ఐదు పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

ఎన్ పీపీకి 19 స్థానాలు ఉండగా, ఆ పార్టీకి యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు ఆరుగురు, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు నలుగురు, బిజెపికీ, హెచ్ఎస్ పీడిపీకి చెందిన ఇద్దరేసి సభ్యులు, ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత విల్లమ్ నగర్ స్థానాన్ని గెలుుచుకోవడంతో ఎన్ పీపీ సభ్యుల సంఖ్య 20కి పెరిగింది. 

ప్రస్తుతం ఎన్ పీపీ కూటమికి 35 మంది సభ్యులున్నారు. సాధారణ మెజారిటీకి నలుగురు సభ్యులు ఎక్కువగా ఉన్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు విజ్ఞప్తి చేసినా ఫలితం ఉండకపోవచ్చునని అంటున్నారు. 

loader