న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కాంగ్రెసు చిచ్చు రగులుతోంది. పార్టీ నేతల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయి. ఆప్ విజయాన్ని కొనియాడుతూ మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెసు నేత షర్మిష్ట ముఖర్జీ భగ్గుమన్నారు. 

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించగానే చిదంబరం ఓ ట్వీట్ చేశాడు. విచ్ఛిన్నకరమైన, ప్రమాదకరమైన బిజెపి ఎజెండాకు వ్యతిరేకంగా ప్రజలు ఆప్ గెలిపించడానికి ప్రజలు ఏకమయ్యారని ఆయన ఆ ట్వీట్ లో అన్నారు. 

"ఆప్ గెలిచింది, మోసం.... బుకాయింపు ఓడిపోయింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఢిల్లీ ప్రజలు ప్రమాదకరమైన, విచ్ఛిన్నకరమైన బిజెపి ఎజెండాను ఓడించారు" అని చిదంబరం అ ట్వీట్ లో అన్నారు. 

 

దానిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు, కాంగ్రెసు నేత షర్మిష్ట ముఖర్జీ మండిపడ్డారు. బిజెపిని ఓడించడానికి కాంగ్రెసు రాష్ట్ర పార్టీలను అరువు తెచ్చుకుంటుందా అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ ఓటమిపై ఆలోచించకుండా ఆప్ విజయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె అడిగారు. 

 

కాంగ్రెసు పార్టీ ఈసారి కూడా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో కూడా పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. 70 స్థానాలున్న శాసనసభలో 63 స్థానాలను ఆప్ గెలుచుకుంది. అభ్యర్థుల ఎంపికలో జాప్యం వల్లనే కాంగ్రెసు ఓటమి పాలైందని షర్మిష్ట అన్నారు.