న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా సోమవారం నాడు మరణించారు. ఆయన వయస్సు 93 ఏళ్లు.ఈ ఏడాది అక్టోబర్ లో ఆయనకు కరోనా సోకింది. కరోనా నుండి అదే నెల 16వ తేదీన కోలుకొన్నారు. దీంతో ఆసుపత్రి నుండి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

 

కరోనా నుండి కోలుకొన్న తర్వాత  ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి.  దీంతో ఆయన  ఈ నెల 19వ తేదీన న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం ఆయన మరణించాడు.

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి ఆయన రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎఐసీసీ జనరల్ సెక్రటరీగా ఆయన కొనసాగుతున్నారు. 

గత రెండు మాసాల కాలంలో కాంగ్రెస్ సీనియర్లు వరుసగా మరణిస్తున్నారు. తరుణ్ గొగొయ్, అహ్మద్ పటేల్ మరణించిన తర్వాత మోతీలాల్ వోరా మరణించారు.

గాంధీ కుటుంబానికి వోరా అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా ఆయన సుధీర్ఘకాలం పనిచేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడ ఆయన పనిచేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడ పనిచేశాడు.

1985 మార్చి 13న  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1988 ఫిబ్రవరి 13న సీఎం పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడానికిగాను ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.