కాంగ్రెస్ చచ్చిన గుర్రం అని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. చచ్చిన గుర్రాన్ని కొరడాతో ఎంత కొట్టినా లాభం లేదని తెలిపింది. కాంగ్రెస్ ను క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీలో చేరుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆప్ ఈ వ్యాఖ్యలు చేసింది.
న్యూఢిల్లీ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం నాడు సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ సమావేశానికి పీకే హాజరయ్యారు. వచ్చే 2024 లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ తీసుకోవాల్సిన చర్యలను పీకే ప్రజెంటేషన్ ద్వారా ఈ సమావేశంలో వివరించారు. అయితే మీటింగ్, పీకే ప్రజెంటేషన్ విషయాలు బయటకు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ఆ పార్టీపై విమర్శలు చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఒక చనిపోయిన గుర్రం అంటూ ఆ పార్టీ వ్యాఖ్యానించింది. పంజాబ్ లో ఘన విజయం అనంతరం బీజేపీకి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే బీజేపీకి ఏకైక సవాలుదారుడు అని పేర్కొంది. ‘‘ చచ్చిన గుర్రాన్ని కొరడాలతో కొట్టడంలో అర్థం లేదు. కాంగ్రెస్ చనిపోయిన గుర్రం ’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రాఘవ్ చద్దా వార్త సంస్థ పీటీఐతో అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీకే పాల్గొన్నారని, దీనిపై అభిప్రాయం చెప్పాలని పీటీఐ కోరినప్పుడు ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీ భారతీయులకు భవిష్యత్తును ఇవ్వలేదని అన్నారు. సున్నాతో దేనిని గుణించినా సున్నానే వస్తుందని రాఘవ్ చద్దా అన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిందని, ఇది కేజ్రీవాల్ పాలనా విధానం, పని రాజకీయాలకు అద్దం పడుతోందని అన్నారు. ‘‘ బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఎదుర్కోగలిగింది ఒక్కరే. ఆయనే అరవింద్ కేజ్రీవాల్ ’’ అని అన్నారు. ‘‘ అరవింద్ కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో బీజేపీని సవాలు చేయడానికి కావాల్సింది సాధించారు ’’ అని రాఘవ్ చద్దా తెలిపారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీలో చేరడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షురాలి నివాసమైన 10 జన్‌పథ్ లో నాలుగు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే, కే సీ వేణుగోపాల్, పార్టీ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
అయితే ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ తాను పార్టీలో చేరతానని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే తనకు ఎలాంటి పదవి అవసరం లేదని, కేవలం పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, దీని కోసం తన వద్ద ప్రణాళిక ఉందని చెప్పారు. దీంతో పాటు 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ చేపట్టాల్సిన చర్యలను కూడా ఆయన వివరించారు.
కాగా ప్రశాంత్ కిషోర్ సూచనలను విన్న కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై వారం రోజుల్లో నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో తెలిపారు. ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న జేడీ (యూ)కి ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2020 సంవత్సరంలో ఆ పార్టీ నుంచి బహిష్కృతం అయ్యారు. అప్పటి నుంచి ఆయనకు ఏ పార్టీతో నేరుగా సంబంధాలు లేవు. పలు పార్టీలకు వ్యూహకర్తగా పని చేస్తూ వస్తున్నారు.
