పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. ఎన్నికల బరిలోకి దిగిన 28మంది నేతలపై కాంగ్రెస్ వేటు వేసింది. వేటు పడిన వారిలో కేంద్ర మాజీ మంత్రి, 9మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన రాజస్థాన్ కాంగ్రెస్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...త్వరలో రాజస్థాన్ లో ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఒక కేంద్ర మాజీ మంత్రి, 9మంది మాజీ ఎమ్మెల్యేలు సహా.. 28మంది పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కాగా.. వారికి టికెట్ లభించలేదు.

దీంతో.. టికెట్ ఆశించి భంగపడిన వీరంతా...  రెబల్స్ గా ఎన్నికల బరిలోకి దిగారు. తమకు ఓటు వేయాలని ప్రజలనుయ కోరుతూ.. పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న పార్టీ ముఖ్య నేతలు.. వారిపై వేటు వేశారు. పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీ నుంచి వేటు పడిన వారు వరుసగా మాజీ కేంద్ర మంత్రి మహదేవ్ సింగ్ ఖండేలా, మాజీ ఎమ్మెల్యేలు సంధ్యమ్ లోధా, నాథూరాం సినోడియా, నావల్ కిషోర్ మీనా, ఖుష్వీర్ సింగ్, సోహన్ నాయక్, సీఎస్ బేయిడ్, రమేష్ చంద్ ఖండేల్వాల్, రమేష్ ఖించి సహా ఇతరులు ఉన్నారు. వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.