ఈ రోజు పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై అటాక్ చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఆ పార్టీ అన్ని హద్దులు దాటేసిందని ఫైర్ అయ్యారు. గాంధీ పేరును వాడుకునేవారికి ఆయన కలలు సాకారం చేయాలనే ఆలోచనలే లేదని, తాము స్వదేశీ కార్యక్రమాలేవైనా చేస్తే అస్సలు స్వాగతించవని అన్నారు. అసలు దేశ స్వాతంత్ర్య సమర యోధులు ఏ పార్టీకీ చెందరని తెలిపారు. కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే మరో వందేళ్లు అధికారంలోకి రాదని అన్నారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో కాంగ్రెస్ అన్ని హద్దులు దాటేసింది. కరోనా నిబంధనల పాలనలోనూ ఆటంకాలు సృష్టించింది. ముఖ్యంగా వలస కార్మికులను లాక్‌డౌన్ సమయంలోనూ ఇంటికి పరిమితం చేయకుండా స్వగ్రామాలకు తరలి వెళ్లేలా రెచ్చగొట్టింది. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు వాడుకుని ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించేవారు.. ఆయన ఆశయాలను ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. ఆయన కలలను తమ ప్రభుత్వం సాకారం చేస్తుంటే ఎందుకు సహకరించదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే మాత్రం మరో వందేళ్లు అధికారంలో రాదని అన్నారు. తాము మరో వందేళ్లు అధికారంలోకి రాలేము అనే ఆలోచనలతోనే వ్యవహరిస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నదని విమర్శించారు. వారు అందుకు సిద్ధమై ఉంటే.. అధికారంలో ఉండటానికి తాము సిద్ధమై ఉన్నామని చెప్పారు. ప్రధాన మంత్రి ఈ రోజు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్‌పై ఆలౌట్ అటాక్ చేశారు.
మహాత్మా గాంధీ పేరు వాడుకునే వారికి ఆయన కలలు నిజం చేయడంపై ఆసక్తి లేదని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం స్వదేశీ కార్యక్రమాలను వారు ఎందుకు సమర్థించరని, ఎందుకు సహకరించరని నిలదీశారు. నేడు ప్రపంచమంతా యోగాను ఆరాధిస్తుంటే.. వారు దాన్ని అపహాస్యం చేయడానికే పూనుకుంటారని ఆరోపించారు. తాము వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ఇస్తే.. వారు ఎందుకు పట్టించుకోరు అని పేర్కొన్నారు. భారత దేశం ఒక స్వయం సమృద్ధ దేశంగా ఎదగడాన్ని వారు కాంక్షించరనే కదా అర్థం అని అన్నారు. అసలు మహాత్మా గాంధీ కలలు సాకారం చేయాలనే ఆశ, ఆలోచన ఆ పార్టీకి లేదని మండిపడ్డారు.
కాగా, కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ సమయంలో లాక్‌డౌన్ విధించాక అందరూ ఇంటికే పరిమితం కావాలనే తమ ప్రభుత్వం చెబితే.. కాంగ్రెస్ పార్టీ రైల్వే స్టేషన్‌లలో వలస కార్మికులను స్వగ్రామాలకు వెళ్లిపోవాలని ఉసిగొల్పిందని ఆరోపించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించేలా ఆ పార్టీ ప్రజలను రెచ్చగొట్టిందని అన్నారు. ఇది దేశ ప్రజలు అందరూ గమనించారని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని వలస కార్మికులు యూపీ, బిహార్‌లకు వెళ్లి పోవడానికి అనుమతించిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో అధికార కూటమిలో కాంగ్రెస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
తాము విమర్శకు వ్యతిరేకం కాదని పీఎం మోడీ అన్నారు. సద్విమర్శలను తాము ఆహ్వానిస్తామని, కానీ, కళ్లు మూసుకుని ప్రతి దాన్ని వ్యతిరేకిస్తూ పోతామంటే.. అంగీకరించబోమని తెలిపారు. ఇలాంటి తిరస్కార ధోరణులతో ముందుకు సాగలేమని హితవు పలికారు. కొందరు ఇంకా 2014లోనే ఉండిపోయారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. అప్పటి నుంచి ఎన్నికల్లో ఓడిపోతున్నా.. వారి అహంకారం తగ్గలేదని అన్నారు.
ఎప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను ముందుకు తేవడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారు అసలు ఏ పార్టీకీ చెందరని మోడీ అన్నారు.
ఇదే తీర్మానంపై రాహుల్ గాంధీ ఇటీవలే పార్లమెంటులో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
