దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీలో తిరిగి జవసత్వాలు నింపాలని సీనియర్ల నుంచి హైకమాండ్‌పై ఒత్తిడి వస్తోంది.

ఈ క్రమంలో రాజస్థా‌న్‌లోని అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అత్యధికంగా 619 వార్డులను కైవసం చేసుకొని ఘన విజయం సాధించి బీజేపీపై పైచేయి సాధించింది.

12 జిల్లాల్లోని 50 అర్బన్ లోకల్ బాడీల్లోని 1775 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 619 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోగా, బీజేపీ 548 వార్డులు, బీఎస్పీ 7 వార్డులను గెలుచుకుంది.

అయితే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధిక్యం సాధించింది. కమల నాథులు 12 జిల్లా పరిషత్లను కైవసం చేసుకోగా, 5 జిల్లాపరిషత్ లను కాంగ్రెస్ గెల్చుకున్నాయి.

పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పనితీరుకు మద్ధతుగా నిలిచారని రాజస్థాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ చెప్పారు. 50 యూఎల్ బీలలో 30 స్థానాల్లో కాంగ్రెస్ బోర్డులను ఏర్పాటు చేసింది.

కాగా, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2,622 పోలింగ్ బూత్‌లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 7,249 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా.. 14.32 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.