కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పదవుల పంపకంపై అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పదవుల పంపకంపై అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖను జేడీఎస్‌, హోం శాఖను కాంగ్రెస్ పంచుకున్నట్లు సమాచారం. ఈ రెండూ కీలక శాఖలు కావడంతో వాటిపై చర్చలు కొనసాగుతూ వచ్చాయి. మిగిలిన శాఖలను పంచుకునే విషయంపై ఇరు పార్టీలు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయి. 

కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కేలా ఇది వరకే అవగాహన కుదిరింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు సీనియర్ మంత్రులు తమకు మళ్లీ అవే శాఖలు కావాలని పట్టుబట్టారని సమాచారం. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ తరపున కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్‌కు గతంలో ఆయన నిర్వహించిన విద్యుత్ శాఖను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేపీసీసీ పదవిని కూడా ఆయనకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

కుమారస్వామి బాధ్యతలు చేపట్టి వారం గడిచినా కుమారస్వామి ఇంకా తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు. కాంగ్రెసు, జెడిఎస్ మధ్య ఆర్థిక, హోంశాఖలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మంత్రివర్గం కూర్పులో ఆలస్యం జరిగింది. కీలకమైన ఆర్థిక శాఖ తమకే కావాలని కుమారస్వామి పట్టుబట్టారు. చివరకు ఆయన డిమాండ్ కే కాంగ్రెసు తలొగ్గింది.

జెడిఎస్ కు 11 మంత్రి పదవులు దక్కుతుండగా ఆరుగురి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. కుమారస్వామి సోదరుడు హెచ్‌.డి.రేవణ్ణ, హెచ్‌.విశ్వనాథ్‌, జి.టి.దేవెగౌడ, సి.ఎస్‌.పుట్టరాజు, బండెప్ప కాశెంపుర, బసవరాజ హొరట్టిలకు మంత్రి పదవులు దక్కుతాయని అంటున్నారు.