ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ తొలిసారిగా భేటీ అయ్యింది. గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా నరేంద్రమోదీ, ఇతరులు కేంద్రమంత్రులుగా 58 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 

శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. శాఖలు కేటాయింపు అనంతరం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేబినెట్ భేటీ అయ్యింది. కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్రమంత్రులు అభినందనలు తెలిపారు.   

ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో పార్లమెంట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. జూన్‌ 17 నుంచి జులై 26 వరకు పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

అలాగే జూన్‌ 19న భారత స్పీకర్ ఎన్నిక జరగనుందని తెలిపారు. అలాగే ఉగ్రదాడులు, నక్సల్స్‌ దాడుల్లో అమరులైన జవాన్ల పిల్లలకు నెలనెలా భారత రక్షణ నిధి నుంచి ఇచ్చే ఉపకార వేతనాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. 

బాలురకు నెలకు ఇచ్చే రూ.2వేల ఉపకారవేతనాన్ని రూ.2500లకు పెంచారు. అలాగే, బాలికలకు ఇచ్చే రూ.2250ను రూ.3వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటివరకు కేంద్ర, పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన్న ఈ ఉపకార వేతనాలను ఇకపై రాష్ట్రాలకూ విస్తరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 

ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారిని ఎంపిక చేయనున్నారు. వీటన్నింటికి నోడల్‌ మంత్రిత్వశాఖగా హోంశాఖ ఉండనుందని స్పష్టం చేశారు. మరోవైపు రైతులకు భృతి ఇచ్చే అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతుంది. 

ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల ఎజెండాతో పాటు  ఖాయిలాపడిన ప్రభుత్వరంగ సంస్థల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రధానంగా వ్యవసాయరంగంలో కీలకంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో అనే అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. 60 ఏళ్లు దాటిన రైతులకు భృతి ఇచ్చేందుకు కేంద్రం శ్రీకారం చుట్టే యోచనలో ఉన్నట్లు స్పష్టమౌతోంది.