న్యూ ఢిల్లీ: భారత తీర ప్రాంతాలకు ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. పొరుగున ఉన్న దేశం భారత దేశాన్ని ఎలాగైనా అస్థిరపరచాలని కుట్రలు పన్నుతోందని పాకిస్తాన్ ను ఉద్దేశించి పాకిస్తాన్ పేరెత్తకుండా అన్నారు. 

భారత దేశ విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో నిన్న రాత్రంతా గడిపారు. భారత రక్షణ కోసం నౌకాదళం ఎలా పనిచేస్తుందో దగ్గరుండి తెలుసుకున్నారు. నౌకాదళం ప్రదర్శించిన ఎన్నో ఒళ్ళు గగ్గురుపొడిచే సాహస కృత్యాలను దగ్గరుండి వీక్షించారు. దేశ తీరప్రాంత రక్షణే ధ్యేయంగా భారత నావికాదళం పనిచేస్తోందని, భవిష్యత్తులో ముంబై తరహా దాడులు జరిగే ఆస్కారమే లేదని ధీమా వ్యక్తం చేసారు. 

ఉగ్రవాదులు చొరబాట్లకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలపై స్పందిస్తూ, ఉగ్రవాదులకు ఎటువంటి గతి పడుతుందో వేరుగా చెప్పనవసరం లేదని అన్నారు. నేటి ఉదయం అదే నౌకపై నౌకా సిబ్బందితో కలిసి యోగ చేసారు.