ఏపీ సీఎం చంద్రబాబే కాదు యూపీ సీఎం యోగి కోరేది అదే...
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని మేవాలాల్ గుప్తా గురుకుల విద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించి, విద్య, ఆధ్యాత్మికతల కలయిక ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించాలని గురుకులాలకు పిలుపునిచ్చారు.
గోరఖ్‌పూర్ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మేవాలాల్ గుప్తా గురుకుల విద్యాలయంలో నూతనంగా నిర్మించిన సభా భవనం, ఐదు తరగతి గదులు, పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. గురుకుల పునరుద్ధరణకు కృషి చేసిన గోరఖ్‌పూర్ గురుకుల సొసైటీ అధికారులను ఆయన అభినందించారు. గోరఖ్‌పూర్ అభివృద్ధిలో భాగంగా తన నిధుల నుండి రూ. 1.05 కోట్లతో ఈ నిర్మాణ పనులు చేపట్టామని ... సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
గురుకులాల్లో ఆధ్యాత్మిక వాతావరణం అవసరం
గురుకులాల్లో యజ్ఞయాగాదులు, హోమాలు వంటి పురాతన ఆర్య సమాజ పద్ధతులను అనుసరించాలని ముఖ్యమంత్రి యోగి సూచించారు. ఈ సంప్రదాయం ఉన్నంత వరకు అక్కడ ఆధ్యాత్మిక, క్రమశిక్షణతో కూడిన వాతావరణం నెలకొని ఉండేదని ... దీని ఫలితంగా విద్యార్థులకు అద్భుతమైన విద్యా ఫలితాలు వచ్చేవని ఆయన చెప్పారు. నేటి కాలంలో విద్య, ఆధ్యాత్మికతల సమ్మిళితం ద్వారానే మంచి ఫలితాలు సాధించగలమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేసారు.
నైపుణ్య అభివృద్ధిపై దృష్టి
గురుకుల విద్యాలయాలు విద్యతో పాటుగా నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఇలాా ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే నైపుణ్యాభివృద్దిపై దృష్టి పెట్టారు... ఇదే యూపీ సీఎం కూాడా కోరుతున్నారు. ఏ ఒక్క బిడ్డ కూడా విద్యకు దూరం కాకూడదని, ప్రతి బిడ్డ భవిష్యత్తులో స్వయం సమృద్ధిని సాధించాలని ఆయన అన్నారు. విద్యారంగంలో జరుగుతున్న ఈ కృషి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
గురుకుల విద్యాలయ చారిత్రక నేపథ్యం
గోరఖ్‌పూర్ గురుకుల విద్యాలయం 1935లో స్థాపించబడిందని సీఎం యోగి తెలిపారు. ఈ గురుకులంలో ఆధ్యాత్మిక, రాజకీయ కార్యకలాపాలు జరుగుతున్నాయనే నెపంతో బ్రిటిష్ ప్రభుత్వం దీనిని 5 సంవత్సరాల పాటు మూసివేసిందని ముఖ్యమంత్రి గుర్తుచేసారు. తర్వాత ఈ విద్యాలయం మళ్లీ కొనసాగింది... ప్రస్తుతం ఇది ఉన్నత పాఠశాలగా నడుస్తోందన్నారు. కాలక్రమేణా వనరుల కొరత కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గిందని, అయితే నూతన నిర్మాణాలు, వనరులతో దీనిని మళ్లీ ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నామని ఆయన అన్నారు.
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను, ప్రతి పౌరుడికీ మెరుగైన వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని మోదీ రూపొందించిన జాతీయ విద్యావిధానాన్ని ప్రస్తావిస్తూ, ఈ విధానం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించిందని, దీనిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించారని ఆయన అన్నారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 10 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.
ముందుగా సీఎం యోగి గురుకుల విద్యాలయంలోని వివిధ తరగతులను సందర్శించి విద్యాబోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి, గురుకుల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమ ప్రారంభంలో విద్యార్థినులు ఆకర్షణీయమైన గణేష్ వందనను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు రవి కిషన్ శుక్లా, మేయర్ మంగలేష్ శ్రీవాస్తవ్, గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. పూనమ్ టండన్, గోరఖ్‌పూర్ గురుకుల సొసైటీ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, కాళిబరి మహంత్ రవీంద్ర దాస్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలు చారు చౌదరి, బిజెపి నగర అధ్యక్షుడు రాజేష్ గుప్తా, సీతారాం జైస్వాల్, ఎమ్మెల్యేలు పవన్ త్రిపాఠి, శివశంకర్ గుప్తా, పరమేశ్వర్ ప్రసాద్ గుప్తా, ఇంద్రదేవ్ విద్యార్థి, జగదీష్ గుప్తా, జిల్లా మెజిస్ట్రేట్ అనిల్ ఢీంగ్రా తదితరులు పాల్గొన్నారు.