Asianet News TeluguAsianet News Telugu

మెడల్ కొట్టు - జాబ్ పట్టు ... యోగి సర్కార్ ప్లాన్ అదిరిపోయిందిగా!

అంతర్జాతీయ క్రీడా వేదికపై సత్తాచాటిన ఉత్తర ప్రదేశ్ క్రీడాకారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సత్కరించారు. ఈ సందర్భంగా యువత స్మార్ట్‌ఫోన్‌లు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

CM Yogi Honors Olympic Medalists, Inspires Youth at Lucknow Felicitation Ceremony AKP
Author
First Published Oct 1, 2024, 6:45 PM IST | Last Updated Oct 1, 2024, 6:45 PM IST

లక్నో : అంతర్జాతీయ క్రీడా వేదికపై సత్తాచాటి భారత కీర్తి పతాకాన్నే కాదు రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ఉత్తర ప్రదేశ్ క్రీడాకారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సత్కరించారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ క్రీడాకారులు సన్మాన కార్యక్రమం జరిగింది. ఒలింపిక్స్ తో పాటు పారా ఒలింపిక్స్ లో సత్తాచాటి పతకాలు సాధించినవారికే కాదు ఈ క్రీడాపోటీల్లో పాల్గొన్న యూపీ క్రీడాకారులను సత్కరించారు సీఎం యోగి. క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం అందించారు. 

ఈ క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ ... నేటి యువతకు స్మార్ట్‌ఫోన్‌లు అతిపెద్ద సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసారు. యువత సమయాన్నే కాదు శారీరక శ్రమను కూడా ఈ ఫోన్ ప్రభావితం చేస్తుందని అన్నారు. ఇప్పుడు క్రీడలు అంటే ఆన్ లైన్ గేమ్స్ అనే పరిస్థితి వచ్చిందని... మైదానంలో దిగి చమటోడ్చి ఆడే ఆటలపై యువతలో మక్కువ తగ్గిందన్నారు. స్మార్ట్ ఫోన్ల ప్రభావం కేవలం చదువులపైనే కాదు క్రీడలపైనా వుందని యోగి ఆందోళన వ్యక్తం చేసారు. 

ఇక క్రీడాకారులకు మరో సమస్య మాదకద్రవ్యాలు. వీటివల్ల చాలామంది క్రీడాకారులు కెరీర్ నాశనం అవుతోంది... కాబట్టి దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలు వినాశనానికి కారణం... ఇలాంటి వ్యసనాల వైపు వెళ్ళే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ ఎవరికీ ఉపయోగపడడని అన్నారు. కాబట్టి యువత అప్రమత్తంగా వుండాలని సీఎం యోగి సూచించారు. 

యువత తమను తాము సిద్ధం చేసుకోవాలి... సౌకర్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. యువత క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని నగరాలు, గ్రామాల్లో క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని...మంచి శిక్షణతో పాటు మంచి శిక్షకులను కూడా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. క్రీడల పెంపుదల కోసం యువతను ప్రోత్సహిస్తూ, సిఎం యోగి సన్మాన సభలో పాల్గొన్న క్రీడాకారుల స్ఫూర్తిదాయక కథనాలను కూడా పంచుకున్నారు.

CM Yogi Honors Olympic Medalists, Inspires Youth at Lucknow Felicitation Ceremony AKP

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమయ్యింది

పోటీ చిన్నదైనా, పెద్దదైనా క్రీడాకారులకు ఎదగడానికి అవకాశం కల్పిస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నేడు దేశంలో క్రీడా వాతావరణం మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా క్రీడలు, క్రీడాకారుల ప్రోత్సాహం కోసం చేపట్టిన ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల ఫలితం నేడు అందరికీ కనిపిస్తోంది. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన ఖేలో ఇండియా ఉద్యమం, ఫిట్ ఇండియా ఉద్యమం,  పార్లమెంట్ క్రీడా పోటీలు దేశవ్యాప్తంగా క్రీడా వాతావరణాన్ని మార్చాయన్నారు యోగి ఆదిత్యనాథ్.

విశ్వవిద్యాలయ స్థాయిలో లీగ్‌లు, గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయని.. ఇది క్రీడాకారులకు ముందుకు సాగడానికి వేదికను కల్పించిందని సిఎం యోగి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఉత్తరప్రదేశ్ అనేక కార్యక్రమాలను రూపొందించిందని... వాటిని ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

క్రీడల కోసం యోగి సర్కార్ ఏం చేస్తోంది?

క్రీడాకారులకు తగిన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సిఎం యోగి అన్నారు. అటు దేశంలోో, ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్నాం ... కాబట్టి డబుల్ ఇంజన్ ప్రభుత్వం దీనిపై నిత్యం దృష్టి సారిస్తోందన్నారు. నేడు ఉత్తరప్రదేశ్‌లో 84 స్టేడియాలు, 67 క్రీడా హాళ్లు, 38 స్విమ్మింగ్ పూల్స్, 15 సింథటిక్ హాకీ స్టేడియాలు, 3 సింథటిక్ రన్నింగ్ ట్రాక్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటితో పాటు 2 అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు, 16 హాస్టళ్లు, 47 అత్యాధునిక జిమ్‌లు, 20 సింథటిక్ టెన్నిస్ కోర్టులు, 19 డార్మిటరీలు క్రీడాకారుల కోసం సిద్ధం చేయబడ్డాయని వెల్లడించారు.

యూపీలో 2 జూడో హాళ్లు, 13 రెజ్లింగ్ హాళ్లు, 6 షూటింగ్ రేంజ్‌లు, 2 ఇండోర్ వాలీబాల్, 12 వెయిట్ లిఫ్టింగ్ హాళ్లు, 14 సింథటిక్ బాస్కెట్‌బాల్ కోర్టులు నిర్మించబడ్డాయని తెలిపారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలోని 57 వేల గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు, ఓపెన్ జిమ్‌లు, 826 అభివృద్ధి బ్లాకుల్లో మినీ స్టేడియాలు, అన్ని జిల్లాల్లో స్టేడియాలు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని... గ్రామ పంచాయతీ స్థాయిలో క్రీడాకారులకు క్రీడా వనరులను అందుబాటులోకి తెస్తున్నామని సీఎం యోగి తెలిపారు. 

CM Yogi Honors Olympic Medalists, Inspires Youth at Lucknow Felicitation Ceremony AKP

క్రీడాకారులకు ఆర్థిక సహాయం

యువ క్రీడాకారుల శిక్షణ కోసం అంతర్జాతీయ, ఒలింపిక్, పారాలింపిక్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో సత్తా చాటిన మాజీ క్రీడాకారులను శిక్షకులుగా నియమిస్తున్నామని ముఖ్యమంత్రి యోగి తెలిపారు. ఏదైనా అంతర్జాతీయ పోటీలో పాల్గొనే క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మణ్ అవార్డు, మహిళా క్రీడాకారులకు రాణి లక్ష్మీబాయి అవార్డును ప్రకటించిందని...  ప్రభుత్వం వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రంతో సత్కరిస్తుందని సిఎం యోగి తెలిపారు.

ఇక జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000/-ల ఆర్థిక సహాయం అందిస్తోందని... వృద్ధ క్రీడాకారులకు కూడా నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు.  రాష్ట్రంలో ఏకలవ్య క్రీడా కోష్టాను ఏర్పాటు చేశామని సిఎం యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ పేరుతో మొదటి క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నామని యోగి ప్రకటించారు.  

ఒలింపిక్ పతక విజేతలకు గెజిటెడ్ ఉద్యోగాలు 

క్రీడాకారులకు నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయదని, యువత క్రీడా రంగంలోకి వచ్చి పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని యోగి సూచించారు, దీని కోసం రాష్ట్ర క్రీడా శాఖ వారి వెన్నంటే ఉంటుందని అన్నారు. ప్రపంచ వేదికలపై రాష్ట్ర క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి మరిన్ని పతకాలు సాధించాలని సభలో ఉన్న క్రీడాకారులకు సిఎం యోగి పిలుపునిచ్చారు.

క్రీడల్లో దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన రాష్ట్ర క్రీడాకారులను గెజిటెడ్ అధికారులుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని యోగి తెలిపారు. ఇద్దరు క్రీడాకారులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,  మరో ఇద్దరు నాయబ్ తహసీల్దార్,  ఒకరు ఎక్సైజ్ ఆఫీసర్, మరో ఇద్దరు క్రీడాకారులు జిల్లా యువజన సంక్షేమ అధికారులుగా నియమితులవుతారని... ఇందుకు సంబంధించి అధికారిక నిర్ణయం జరిగిందని యోగి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా, క్రీడా మంత్రి గిరీష్ చంద్ర యాదవ్, మేయర్ సుష్మా ఖర్క్వాల్, ఎమ్మెల్యే నీరజ్ బోరా, విధాన పరిషత్ సభ్యుడు అవనీష్ సింగ్, బిజెపి మెట్రోపాలిటన్ అధ్యక్షుడు ఆనంద్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.

CM Yogi Honors Olympic Medalists, Inspires Youth at Lucknow Felicitation Ceremony AKP

అవార్డులు పొందిన క్రీడాకారులు

ఉత్తరప్రదేశ్ క్రీడాకారులు భారత్ తరపున ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో బరిలోకి దిగారు. వీరిలో ఒకరు బంగారు పతకంతో సాధించారు... ఇలా మొత్తం ఆరు పతకాలు సాధించారు. గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన పారా హై జంపర్ ప్రవీణ్ కుమార్ పారాలింపిక్స్ 2024లో స్వర్ణ పతకం సాధించారు. అతనికి రూ.6 కోట్ల నగదు బహుమతి అందజేశారు. భారత హాకీ జట్టు తరపున ఆడుతూ వారణాసికి చెందిన లలిత్ ఉపాధ్యాయ, గజిపూర్‌కు చెందిన రాజ్‌కుమార్ పాల్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు. వారికి ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున నగదు బహుమతి అందజేశారు.

యూపీకి చెందిన ఐఏఎస్ అధికారి సుహాస్ ఎల్‌వై పారా బ్యాడ్మింటన్‌లో, ఇటావాకు చెందిన అజిత్ సింగ్ పారా అథ్లెటిక్స్‌లోని జావెలిన్ త్రో లో రజత పతకాలు సాధించారు. వారిద్దరికీ రూ.4 కోట్ల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ముజఫర్‌నగర్‌కు చెందిన అథ్లెట్ ప్రీతి పాల్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది, దీని కోసం ఆమెకు రూ.4 కోట్లు, గజియాబాద్‌కు చెందిన సిమ్రాన్ 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది, దీని కోసం ఆమెకు రూ.2 కోట్ల నగదు బహుమతి అందజేశారు.

 అంతేకాకుండా పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్ క్రీడల్లో పాల్గొని ఉత్తరప్రదేశ్ కీర్తిని ప్రతిష్టించినందుకు పారూల్ చౌదరి, అను రాణి, ప్రియాంకా గోస్వామి, ప్రాచి చౌదరి, సాక్షి కసానా, దీపేష్ కుమార్, యశ్ కుమార్‌లను రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులతో సత్కరించారు.

పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ కోసం క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన నలుగురు శిక్షకులను కూడా సిఎం యోగి సత్కరించారు. వీరిలో గజేంద్ర సింగ్ (పారా అథ్లెట్), గౌరవ్ ఖన్నా (పారా బ్యాడ్మింటన్), రాకేష్ కుమార్ యాదవ్ (పారా అథ్లెట్), డాక్టర్ సత్యపాల్ సింగ్ (పారా అథ్లెట్) ఉన్నారు. శిక్షకులను సత్కరించడం ముఖ్యమని, ఎందుకంటే మన క్రీడాకారులను ఒలింపిక్స్ వంటి పోటీలకు తీర్చిదిద్దేది, సిద్ధం చేసేది శిక్షకులేనని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాాథ్ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios