అందుకే మోదీ నాయకుడయ్యారు : ప్రధానిపై యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర కామెంట్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితం, నాయకత్వ లక్షణాలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. సున్నా నుంచి శిఖరానికి చేరుకున్న ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

CM Yogi highlights PM Modi's journey from humble beginnings to becoming Prime Minister AKP

లక్నో : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. మోదీ వ్యక్తిగత జీవితంలో చాలా క్రమశిక్షణ, సింప్లిసిటీతో ఉంటారని ఆదిత్యనాథ్ అన్నారు. సామాన్య పౌరుడిగా, కార్యకర్తగా ఆయన సున్నా నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారని చెప్పారు. ఆయన కృషి, కుటుంబం నుంచి లభించిన క్రమశిక్షణ, సంస్కారాలు ఈ స్థాయికి చేర్చాయంటూ యోగి అన్నారు.

దేశ అభివృద్దే లక్ష్యంగా చేసుకుని మోదీ జీవితాన్ని సాగించారు... అందువల్లే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధిపతిగా (భారతదేశ ప్రధానమంత్రిగా) మనందరికీ నాయకత్వం వహిస్తున్నారని కొనియాడారు. ప్రముఖ రచయిత ఆర్. బాలసుబ్రమణ్యం రాసిన పుస్తకం ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని వివరిస్తుందని... ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు.

లోక్ భవన్ మీటింగ్ హాల్ లో నిర్వహించిన సేవా పక్షోత్సవ సదస్సుకు హాజరయ్యారు సీఎం యోగి.  ఈ సందర్భంగా రచయిత ఆర్. బాలసుబ్రమణ్యం రాసిన 'పవర్ విత్ ఇన్: ది లీడర్ షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ' పుస్తకంలోని కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు.  

CM Yogi highlights PM Modi's journey from humble beginnings to becoming Prime Minister AKP

మోడీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే పుస్తకం

ఆర్. బాలసుబ్రమణ్యం రాసిన 'పవర్ విత్ ఇన్: ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ' పుస్తకం ప్రధాని మోడీ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని దేశ, విదేశాలకు పరిచయం చేస్తుందని సీఎం యోగి అన్నారు. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదు, సున్నా నుంచి శిఖరానికి చేరుకున్న ఓ అద్భుత ప్రయాణానికి నాంది అని అన్నారు. 

మోడీ సమర్థవంతమైన, దార్శనిక నాయకత్వంలో నవ భారత స్వప్నం సాకారం అవుతోందని చెప్పారు. సేవా దీక్షతో ఆయన ముందుకు సాగిన ప్రయాణం, దేశాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లడం, అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించాలనే ఆయన సంకల్పం, ఈ పుస్తకం ద్వారా దేశ, విదేశాలకు తెలియజేసే ప్రయత్నం జరిగిందని సీఎం యోగి అభిప్రాయపడ్డారు. 

ఏ దేశమూ అకస్మాత్తుగా అభివృద్ధి చెందలేదని ... గొప్ప దార్శనికత, లక్ష్యంతో కృషి చేస్తేనే అభివృద్ది సాధ్యమయ్యిందని సీఎం యోగి అన్నారు. దేశం స్వాతంత్య్ర అమృతోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో ప్రధాని మోడీ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ఇచ్చారని ... దాని కోసం మార్గాన్ని కూడా సూచించారని చెప్పారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు, దానిని సాధించే మార్గాన్ని సూచించడం దార్శనిక నాయకత్వానికి నిదర్శనం అని యోగి అన్నారు.

గత పదేళ్ల పాలనలో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ వంటి కార్యక్రమాలను ప్రధాని మోడీ అమలు చేశారని ... మౌలిక సదుపాయాల పరంగా భారత్ ను సుసంపన్నం చేశారని కొనియాడారు. ఎవరూ చేరుకోలేని చోటికి భారత చంద్రయాన్ చేరుకుందని యోగి గుర్తు చేశారు.

అందుకే మోదీ నాయకుడయ్యారు

ప్రధాని మోడీ సమ్మిళిత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారని తెలిపారు. 'సర్వే భవంతు సుఖినః, సర్వే సన్తు నిరామయా' అనేది భారతీయ ఋషి పరంపర ... దీన్ని ఆదర్శంగా తీసుకునే 2014లో ప్రధాని మోడీ 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అనే మంత్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.

సంక్షోభం వచ్చినప్పుడు దృఢంగా ఎదుర్కోవడానికి, ప్రజలను ఆదుకునేందుకు నాయకుడు ముందుండాలని ... కరోనా సమయంలో ప్రధాని మోడీ ఇదే చేసారన్నారు. కార్మికులు, చేతివృత్తుల వారు, హస్తకళాకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపిందని గుర్తించి 80 కోట్ల మందికి ఉచిత రేషన్ సౌకర్యం కల్పించారని చెప్పారు. దీనితో పాటు అనేక పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చారని... కులం, భాష, ప్రాంతం చూడకుండా అందరినీ కలుపుకుపోతూ 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అనే సమ్మిళిత భావనతో ఈ పథకాలను అమలు చేశారని అన్నారు. ఈ పథకాలు భారతదేశ ఇమేజ్ ను 'ఈజ్ ఆఫ్ లివింగ్' పరంగా అత్యుత్తమ ప్రయత్నాలు చేస్తున్న దేశంగా మార్చాయని కొనియాడారు.

CM Yogi highlights PM Modi's journey from humble beginnings to becoming Prime Minister AKP

పాకిస్తాన్ కు మోదీ ఎలా బుద్ధి చెప్పారంటే 

కరోనా సమయంలో ప్రధాని మోడీ నాయకత్వంలో ట్రేస్, టెస్ట్, ట్రీట్, వ్యాక్సిన్ లను ఉచితంగా అందించారని సీఎం యోగి అన్నారు. ఉద్యోగాలు పోయినప్పుడు పేదలకు అన్ని విధాలా సాయం అందించారు. ఇలా ప్రజారంజక పాలన అందిస్తూనే శతృదేశం పాకిస్తాన్ దుస్సాహసం చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ వైమానిక దాడులతో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.

జాతి నిర్మాణం కేవలం కర్తవ్యం మాత్రమే కాదని, అది ఒక దైవదత్తమైన బాధ్యత అని అన్నారు. సిక్కుల విశ్వాసానికి సంబంధించిన కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణం, బాలల దినోత్సవాన్ని గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా జరుపుకుంటూ 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' అనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని కొనియాడారు.

యోగా ఋషుల పరంపరకు అద్దం పడుతుందని యోగి అన్నారు. అందువల్లే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు 200 దేశాలను యోగా పరంపరతో అనుసంధానించారని చెప్పారు. 2019లో ప్రయాగ్ రాజ్ కుంభమేళాన్ని దివ్యంగా, భవ్యంగా నిర్వహించే అవకాశం లభించిందని... యునెస్కో అంతర్జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం కూడా ప్రధాని మోడీ కృషి ఫలితమే అని అన్నారు.

అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ 

బీజేపీ కేవలం అధికారం కోసం పాకులాడే పార్టీ కాకూడదనేది ప్రధాని మోడీ ఆకాంక్ష అని సీఎం యోగి అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ... ఈ దేశంలో అతిపెద్ద పార్టీగా బిజెపి గుర్తింపు పొందాలనేది ప్రధాని మోడీ లక్ష్యం ... ఇది ఆయన దార్శనిక నాయకత్వంలోనే సాధ్యమైందని అన్నారు. దేశం ఏదైనా విపత్తును లేదా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు 'సేవాయే సంఘటన్' అనే సూత్రాన్ని గుర్తుంచుకుని కార్యకర్తలకు పిలుపునిచ్చారని, కరోనా సమయంలో బీజేపీకి చెందిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. కరోనా నిర్వహణలో భారతదేశం అత్యుత్తమ నమూనాను ప్రపంచానికి అందించిందని కొనియాడారు.

అస్సాం, త్రిపుర, ఒడిశాల్లోనూ బీజేపీ దూకుడు

ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ కష్టతరమైన ప్రాంతాల్లో కూడా అడుగుపెట్టిందని యోగి అన్నారు. అస్సాంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీలో నుంచే డాక్టర్ మహేంద్ర సింగ్ ను పరిశీలకుడిగా పంపారని గుర్తు చేశారు. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ లలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్పారు.

ఈ ప్రాంతాల్లో బీజేపీ గురించి ప్రజల్లో సందేహాలు ఉండేవని... వేర్పాటువాద ధోరణులు కనిపించేవని యోగి అన్నారు. కాంగ్రెస్ 2014 ముందు ఉన్న ప్రభుత్వాలు వారిని ఆత్మీయంగా కలుపుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ప్రధాని మోడీ 'లుక్ ఈస్ట్' విధానం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించారని, దాని ఫలితంగా నేడు అవి అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అన్నారు. ఉగ్రవాదం నుంచి విముక్తి పొంది, భారతదేశ సమగ్రత, ఐక్యతను బలోపేతం చేశాయని చెప్పారు.

ఈ ప్రాంత ప్రజలు కూడా సాంస్కృతికంగా, రాజకీయంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిసిపోయి గర్వంగా భావిస్తున్నారని అన్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఉందని, పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉందని, అక్కడ బీజేపీ ప్రజల గొంతుకగా బలంగా ఎదిగిందని అన్నారు. దేశంలోని పెద్ద భాగంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, దేశ హితం కోసం బీజేపీ గెలుపు అవసరమని మోడీ చెప్పారని యోగి గుర్తు చేశారు.

CM Yogi highlights PM Modi's journey from humble beginnings to becoming Prime Minister AKP

ప్రపంచానికి పెద్దన్నగా భారత్

ఒకప్పుడు ప్రపంచంలో ద్విధ్రువ వ్యవస్థగా ఉండేదని.. ఒక వైపు అమెరికా, మరోవైపు రష్యా (సోవియట్ యూనియన్) నాయకత్వం వహించేవని సీఎం యోగి అన్నారు. క్రమంగా ఈ వ్యవస్థ ఏకధ్రువంగా మారింది... నేడు భారతదేశం లేకుండా ప్రపంచ వ్యవస్థ గురించి ఊహించలేమని అన్నారు. భారత్ ఏం కోరుకుంటే ప్రపంచం అదే చేయాల్సిన పరిస్థితి నెలకొందని యోగి చెప్పారు.

భారతదేశంలో జరిగిన జీ-20 సదస్సు విజయవంతమైందని, అనేక కార్యక్రమాల్లో ఉత్తరప్రదేశ్ పాల్గొనే అవకాశం లభించిందని అన్నారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొన్న అనేక దేశాల అధినేతలు, భారతదేశం నిర్వహించినంత సమర్థవంతంగా మరెక్కడా జరగలేదని ప్రశంసించారని చెప్పారు. బ్రిక్స్, క్వాడ్ వంటి వేదికలపై ప్రధాని మోడీ అందించిన నాయకత్వం ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి దోహదపడుతుందని అన్నారు.

 ప్రజలతో మోదీ మమేకం

ప్రధానమంత్రి ప్రజలతో నిరంతరం సంప్రదింపుల్లో ఉంటారని సీఎం యోగి అన్నారు. ప్రజా భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమమూ విజయవంతం కాదని, ఆయన ప్రతి కార్యక్రమం దేశం పేరు మీదే ఉంటుందని, ప్రజా భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ దీనికి ఉదాహరణ అని, మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా సామాన్యుల సమస్యలను ప్రధాని వెలుగులోకి తెచ్చారని చెప్పారు. గతంలో పద్మ అవార్డులకు దూరంగా ఉన్న వారికి, విశిష్ట సేవలు అందించిన వారికి ఇప్పుడు ఈ అవార్డులు లభిస్తున్నాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో 2.62 కోట్లకు పైగా కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి మహిళల గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేశామని చెప్పారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios