Asianet News TeluguAsianet News Telugu

బీహార్ ఎన్నికల్లో నా లక్ష్యం నెరవేరింది: చిరాగ్ సంచలన వ్యాఖ్యలు

ఎన్డీఏ నుంచి బయటకి వచ్చి బీహార్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అంచనాలు తారుమారయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకు గానూ ఆయన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది

chirag paswan now says all he wanted was to make bjp stronger
Author
Patna, First Published Nov 11, 2020, 4:34 PM IST

ఎన్డీఏ నుంచి బయటకి వచ్చి బీహార్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అంచనాలు తారుమారయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకు గానూ ఆయన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయినప్పటికీ తాను కోరుకున్నది ‘‘సాధించా’’నంటూ చిరాగ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బీజేపీ మరింత బలపడాలని తాను బలంగా కోరుకున్నాననీ... తన పార్టీ ప్రభావంతోనే ఇది జరిగినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

అన్ని పార్టీల మాదిరిగానే తాను కూడా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో మా పార్టీ గెలవాలని కోరుకున్నానని చిరాగ్ వెల్లడించారు. అయితే ఈ ఎన్నికల్లో తన అసలు లక్ష్యం రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమేనని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. 

కాగా నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల చిరాగ్... ఎన్డీయే నుంచి తాను బయటికి రావడానికి ప్రధాన కారణం నితీశ్ ప్రభుత్వాన్ని ఓడించడమేనని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.

Also Read:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020: హిల్సాలో 12 ఓట్లతో జేడీ(యూ) అభ్యర్ధి విజయం

ఎన్నికల్ల సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు సంపాదించి బీజేపీతో కలిసి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే నితీశ్ నేతృత్వంలోని జేడీయూ అభ్యర్థులందరిపైనా ఎల్జేపీ అభ్యర్థులను బరిలోకి దించారు.

ఈ కారణంగానే దాదాపు అన్ని చోట్లా ఓట్లు చీలి జేడీయూకి గండిపడినట్టు భావిస్తున్నారు. కేవలం పాశ్వాన్ కారణంగానే జేడీయూ దాదాపు 20 స్థానాల్లో ఓడిపోయిందని బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ సైతం అంగీకరించారు. మొత్తంగా చిరాగ్ పాశ్వాన్ వల్ల ఎన్డీయే దాదాపు 40 స్థానాలు నష్టపోయిందని అంచనా. 

బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన ఆర్జేడీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  మంగళవారం వెలువడిన బీహార్‌ శాసనసభ ఫలితాల్లో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో విజయం సాధించి సాధారణ మెజారిటీతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.

137 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోనే ఎల్‌జేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. జేడీ (యూ) ఓట్లను భారీగా చీల్చేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయించిందని కొందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.     
 

Follow Us:
Download App:
  • android
  • ios