వరుస వివాదాలు, డైరెక్టర్‌గా అలోక్ వర్మకు ఉద్వాసన వంటి పరిణామాల ఫలితంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పట్ల దేశ ప్రజల్లో ఉన్న ప్రతిష్ట మసకబారుతోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశానికి ద్వారాలు మూసుకుపోతున్నాయి.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోకి సీబీఐ ప్రవేశంపై ఉన్న అనుమతిని రద్దు చేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఛత్తీస్‌గడ్ సైతం ఇదే బాటలో నడిచింది. రాష్ట్రంలో సీబీఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

‘‘డీఎస్‌పీఈ చట్టం 1946లోని సెక్షన్ 6 ప్రకారం రాష్ట్రంలో విచారణ జరిపేందుకు సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. దీనిపై 2001 ఏప్రిల్ 25న హోంశాఖ వెలువరించిన ఉత్తర్వులను సైతం డీనోటిఫై చేయాలని కోరడం జరిగిందని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొంది. ఇకపై సీబీఐ తమ రాష్ట్రంలో ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని తెలిపింది.