ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిండు సభలో కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళితే... ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు భూపేశ్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఇప్పుడాయన ముఖ్యమంత్రి కావడంతో ఆ బాధ్యతలను వేరొకిరికి అప్పగించాల్సిందిగా కొన్ని రోజుల క్రింత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరారు. దీంతో హైకమాండ్ మోహన్ మార్కమ్‌ను ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో.. శనివారం మోహన్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి భూపేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సీఎం భావోద్వేగానికి గురయ్యారు.

2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2013లో తనను రాష్ట్ర అధ్యక్షుడిగా రాహుల్ నియమించారని..  2014లో ఓటమి తర్వాత పార్టీలో మార్పులు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశామని.. తనకు సహకరించిన ప్రతి ఒక్క నేత, కార్యకర్తకు భూపేశ్ కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

దీంతో అక్కడున్న కార్యకర్తలు.. బఘేల్ జిందాబాద్.. కాంగ్రెస్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్ సింగ్ పాలనకు తెరదించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.