దశాబ్ధాల మిస్టరీకి తెరపడింది. హిమాలయాల్లో రూప్‌కుండ్ సరస్సు వద్ద లభించిన అస్థిపంజరాలు ఏ దేశం వారివో తేలింది. ఆ అస్థిపంజరాలు గ్రీకు మధ్యదరా ప్రాంతానికి చెందిన వారివిగా హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసింది.

1956లో భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు కొందరు హిమాలయాల్లోని రూప్‌కుండ్ సరస్సు వద్ద 500 అస్తిపంజరాలు ఉండటాన్ని గుర్తించారు. నాటి నుంచి ఇవి ఎవరు...? ఎక్కడి వారు..? ఈ సరస్సు వద్ద ఎందుకు మరణించారన్న విషయాలు మిస్టరీగా మారింది.

దీంతో రూప్‌కుండ్ మిస్టరీని ఛేదించేందుకు సీసీఎంబీ 2005లో ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం డాక్టర్ లాల్జీసింగ్, డాక్టర్ తంగరాజ్‌లు పరిశోధనలు ప్రారంభించారు... లాల్జీ ఇటీవలే మరణించగా... దేశీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సహకారంతో తంగరాజ్ మిస్టరీని ఛేదించారు.

వీరంతా నందాదేవి దర్శనానికి వెళుతున్న వారు గానీ.. వ్యాపారులు కానీ అయ్యే అవకాశాలున్నాయన్నారు. ఏడాదిలో 11 నెలల పాటు ఇక్కడ మంచు కురుస్తూనే ఉంటుందని.. 62 కి.మీ పొడవున కొండలు ఎక్కి సరస్సు వద్దకు చేరుకునేందుకు ఐదు రోజులు పడుతుందన్నారు.

వేల ఏళ్ల క్రితం నాటి అవశేషాలు కావడంతో ఏన్షియంట్ డీఎన్ఏ క్లీన్ ల్యాబ్‌లో 72 ఎముకల నమూనాలను విశ్లేషించగా... వీటిలో సగం భారతీయులవి కాగా.. మరో సగం మధ్యదరా ప్రాంతం, గ్రీస్, క్రిటా జాతులకు చెందిన వారివిగా గుర్తించినట్లు తంగరాజ్ తెలిపారు.

టిబెట్‌కు చెందిన వ్యాపారులు, నందాదేవి దర్శనార్ధం భక్తులు ఈ మార్గం మీదుగా వెళ్తుంటే... ప్రకృతి విపత్తులతో సరస్సులో పడిపోయి మరణించివుంటారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.