పశ్చిమ బెంగాల్‌ న్యాయ శాఖ మంత్రి మోలోయ్ ఘటక్ నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహించింది.. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు ఈ సోదాలు చేపట్టారు. 

పశ్చిమ బెంగాల్‌ న్యాయ శాఖ మంత్రి మోలోయ్ ఘటక్ నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహించింది.. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు ఈ సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఆరు చోట్ల సీబీఐ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ అధికారులు.. కేంద్ర పారామిలటరీ సిబ్బంది సాయం తీసుకున్నారు. సోదాలు నిర్వహిస్తున్న బృందంలో మహిళా అధికారులు కూడా ఉన్నారు.

బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కార్యాలయంలో మోలోయ్ ఘటక్‌ గతంలో ఒకసారి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయనకు పలుమార్లు సమన్లు ​​పంపినప్పటికీ.. దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకాలేదని తెలుస్తోంది. ఇక, బొగ్గు కుంభకోణంలో కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని కూడా ఈడీ పలుమార్లు ప్రశ్నించింది.

‘‘బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంలో అతని పేరు బయటికి వచ్చినందున.. అందులో అతని పాత్ర ఏమిటో మేము కనుగొనవలసి ఉంది. కుంభకోణంలో ఘటక్ ప్రమేయం ఉన్నట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయి’’ అని ఓ సీబీఐ అధికారి చెప్పినట్టుగా పీటీఐ వార్త సంస్థ తెలిపింది. 

ఇదిలా ఉంటే.. బెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీని స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జూలైలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో టీఎంసీ నేత అనుబ్రత మండల్‌ను సీబీఐ ఆగస్టులో అరెస్టు చేసింది.

మరోవైపు మోదీ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తమ పార్టీ నేతలను వేధించేందుకు, భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.