కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసు : సిబిఐ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక ప్రక్రియ పూర్తయ్యింది. దర్యాప్తు సంస్థ సిబిఐ కీలక విషయాలతో కూడిన చార్జ్ షీట్ దాఖలు చేసింది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దేశమంతా ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
కోల్ కతాలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో కీలక విషయాలున్నాయి. వాలంటీర్ గా పనిచేస్తున్న రాయ్ ఆగస్టు 9 న బాధితురాలు విరామ సమయంలో ఆసుపత్రి సెమినార్ గదిలో నిద్రిస్తుండగా చూసాడని... ఒంటరిగా వున్న ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పేర్కొంది. అతడు ఒక్కడే ఈ నేరానికి పాల్పడ్డాడని... గ్యాంగ్ రేప్ జరగలేదని సిబిఐ స్పష్టం చేసింది.
అసలు ఏం జరిగింది?
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో ఈ ఏడాది ఆగస్ట్ 9న దారుణం జరిగింది. అర్ధరాత్రి సమయంలో హాస్పిటల్ సెమినార్ హాల్లో పిజి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి అతి దారుణంగా హతమార్చారు. యువ డాక్టర్ పై జరిగిన ఈ అమానుష ఘటన యావత్ దేశాన్ని కదిలించింది... నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళనలు, యువతి మృతికి సంతాపంగా ర్యాలీలు జరిగాయి.
ఈ క్రమంలోనే వైద్యురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హతమార్చారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ప్రజల ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. కానీ ఈ 31 ఏళ్ల యువ డాక్టర్ పై సామూహిక హత్యాచారం జరగలేదని... నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడని సిబిఐ ముందునుండి చెబుతూ వస్తోంది. తాజాగా న్యాయస్థానంలో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ చార్జ్ షీట్ దాఖలు చేసింది.
నిందితుడు సంజయ్ రాయ్ ఏమంటున్నాడు :
హాస్పిటల్ ఆవరణలోనే యువ డాక్టర్ పై హత్యాచారం జరగడం చాలా సీరియస్ అయ్యింది. దీంతో యువతిపై అఘాయిత్య జరిగిన సెమినార్ హాల్ ఎంట్రీలోని సిసి కెమెరాను పరిశీలించిన పోలీసులకు తెల్లవారుజామున 4.30 గంటలకు లోపలికి వెళుతూ... అరగంట తర్వాత బయటకు వస్తూ కనిపించాడు. అలాగే అతడి హెడ్ ఫోన్స్ కూడా అక్కడ లభించాయి. దీంతో అతడే ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్దారించుకున్న పోలీసులు అరెస్ట్ చేసారు.
ఈ కేసు విచారణ పోలీసుల నుండి సిబిఐకి బదిలీ అయ్యాక సంజయ్ రాయ్ ని విచారించారు. అతడు నిజాలు చెప్పడంలేదంటూ లై డిరెక్టర్ పరీక్షలు నిర్వహించారు. కానీ అందులోనూ తాను నిర్దోశిననే సంజయ్ తెలిపాడు. తాను సెమినార్ హాల్ లోకి వెళ్లినమాట నిజమే... కానీ అప్పటికే యువతి గాయాలతో అపస్మారక స్థితిలో పడివుందని తెలిపారు. దీంతో భయపడిపోయిన తాను ఈ అక్కడినుండి వెళ్లిపోయినట్లు సంజయ్ రాయ్ చెబుతున్నాడు.