తాను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలిని చూడాలని అనిపించింది. సాహసం చేసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమెను కలిసిన తర్వాత.. వారి కుటుంబసభ్యులకు కనపించకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో.. పొరపాటు దేశ బోర్డర్ దాటేసి పాక్ లో అడుగుపెట్టాడు. ఈ సంఘటన గతేడాది నవంబర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గెమ్రా రామ్ మేఘ్ వల్(19) అనే యువకుడు భారత్-పాక్ సరిహద్దుల్లో గల కుంహారో కా టిబ్బా ప్రాంతంలో నివసిస్తున్నాడు. 2020 నవంబర్ లో అతను తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆమె తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రావడంతో.. అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అలా పారిపోతూ పొరపాటున దేశ సరిహద్దు దాటి పాక్ లోకి అడుగుపెట్టాడు.

ఆతర్వాత పాక్ అధికారులు అతనిని అరెస్టు చేసినట్లు రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సదరు యువకుడిని పాకిస్థాన్ లో ఎన్ని చిత్ర హింసలు పెడుతున్నారోనని అతని కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. గత నవంబర్ లోనే తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. తమ కుమారుడిని ఎలాగైనా భారత్ తీసుకురావాలంటూ అతని తల్లిదండ్రలు వేడుకుంటున్నారు. భారత అధికారులు సైతం పాక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. చట్టపరమైన చర్యలు పూర్తి చేసిన తర్వాత యువకుడిని భారత్ కి అప్పగిస్తామని వారు చెప్పడం గమనార్హం.